KP Sharma Oli : నేపాల్ (Nepal) ప్రధాన మంత్రి (Prime Minister) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఇవాళ సాయంత్రం కొత్త ప్రధాని (New Pirme Minister) ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున యువత ఆందోళనలకు దిగింది. ఈ ఆందోళనల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో సోమవారం 20 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రధాని ఓలి రాజీనామా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని రాజీనామా చేశారు.
అంతకుముందు నిరసనకారులు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడి లూటీ చేశారు. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇంటిపై కూడా నిరసనకారులు దాడులకు దిగి లూటీకి పాల్పడ్డారు. ఇళ్ల నుంచి నోట్ల కట్టలు తెచ్చి గాల్లోకి విసిరారు. ప్రధాని ఓలి అధికారిక నివాసంలోకి చొరబడి ధ్వంసం చేశారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసంపై కూడా దాడి చేశారు.
అదేవిధంగా యూఎమ్ఎల్ నాయకుడు మహేష్ బాస్నెట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్థాపా, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా, మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ఇళ్లపై కూడా దాడులకు పాల్పడ్డారు. ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి నిప్పుపెట్టారు. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోవడంతో ఆ దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు.