Nepal Airports : నేపాల్ (Nepal) లో నిరసనలు తీవ్రతరం కావడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి యువత చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేల మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని (Prime Minister) కేపీ ఓలి (KP Oli) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఖాట్మండు (Kathmandu) లోని పార్లమెంట్ వద్ద రోడ్లను దిగ్బంధించారు.
పలువురు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడి లూటీ చేశారు. మాజీ ప్రధాని ఇంటిపై కూడా నిరసనకారులు దాడులకు దిగి లూటీకి పాల్పడ్డారు. ఇళ్ల నుంచి నోట్ల కట్టలు తెచ్చి గాల్లోకి విసిరారు. ప్రధాని ఓలి అధికారిక నివాసంలోకి చొరబడి ధ్వంసం చేశారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. దాంతో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు.
ఇక నిరసనకారులు నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసంతోపాటూ నేపాల్ మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ, యూఎమ్ఎల్ నాయకుడు మహేష్ బాస్నెట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్థాపా, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా, మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్, ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసి నిప్పుపెట్టారు.