న్యూఢిల్లీ, జూలై 1: నీట్ యూజీ-2024 రీటెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితోపాటు సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 6 కేంద్రాల్లో ఈ పరీక్ష ఆలస్యంగా జరగడం వల్ల సమయాన్ని కోల్పోయిన 1,563 మంది అభ్యర్థులకు పరిహారంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ 1,563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను రద్దుచేసి, గత నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించారు. కానీ, వారిలో 813 మంది మాత్రమే రెండోసారి పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 750 మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు లేకుండా మొదట వచ్చిన మార్కులనే కోరుకున్నట్టు ఎన్టీఏ అధికారులు తెలిపారు. కాగా, గ్రేస్ మార్కుల కారణంగా ఆరుగురు అభ్యర్థులు 720/720 మార్కులు సాధించి టాప్ ర్యాంకులో నిలవగా, గ్రేస్ మార్కుల తొలగింపు తర్వాత వారిలో ఐదుగురు రీటెస్ట్‌కు హాజరయ్యారు. కానీ తాజా ఫలితాల్లో వారికి ఫుల్ మార్కులు సాధించలేదు. దీంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది.