హిమాయత్‌నగర్,జూన్25: ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీకేజీ చేశారని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి స్వార్థపూరిత చర్యల వల్ల 22లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో నీట్‌పై ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటే.. పేపర్ లీకేజీల వల్ల వారి శ్రమ వృథా అవుతుందని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. విద్యావ్యవస్థలో పారదర్శకతను పాటిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు.