NBK 111 | నటసింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు. వయసు 60 దాటినా కూడా ఆయన ఉత్సాహం, యాక్షన్, స్టైల్ తగ్గేదే లేదు. వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తనదైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అదే విజయాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతోంది. బాలయ్య–బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘అఖండ 2’తోపాటు బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ‘NBK 111’ కి సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ‘వీర సింహారెడ్డి’ తర్వాత మళ్లీ దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ జట్టుకట్టబోతున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రీసెంట్గా చిత్ర బృందం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. “ చరిత్ర యుద్ధభూమి దాని రాణిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం ఆమె గంభీరమైన రాకను చూస్తోంది… ” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం రేపింది. ఈ మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు అందరు భావించారు. అయితే చేవెళ్ల దగ్గర జరిగిన భారీ బస్సు ప్రమాదంలో 24 మంది కన్ను మూయడంతో చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. పోస్టర్ రిలీజ్ వాయిదా వేశారు.
అలానే ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకి మూవీ టీమ్ సానుభూతి తెలియజేస్తున్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ చిత్రంలో బాలయ్య ఒక శక్తివంతమైన, చారిత్రాత్మక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, ఈ సినిమాలో రాణిగా నయనతార నటించనున్నారన్న వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ‘NBK 111’ చిత్రం భారీ సెట్స్, యుద్ధ సన్నివేశాలు, మాస్ ఎమోషన్లతో కూడిన పవర్ఫుల్ స్టోరీగా తెరకెక్కుతోంది.బాలయ్య తన కెరీర్లో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.