Police Complaint | వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. చిత్ర యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సినిమా సాధించిన విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ సినిమా వెనుక జరిగిన వివాదాలను, సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలను సుదీర్ఘంగా పంచుకుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొనలేదంటూ చిత్రయూనిట్ గతంలో ఆరోపణలు చేసిందని, ఈ వివాదంపై ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించిన విషయాన్ని గుర్తుచేశారు. పరిశ్రమలోని పెద్దల జోక్యంతో ఈ వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించుకున్నామని, ఇందులో భాగంగానే దర్శకుడు సంజీవ్ మేగోటి గారు తన తప్పు లేకపోయినా పెద్ద మనసుతో వరలక్ష్మికి సారీ చెప్పారని వెల్లడించారు. దర్శకుడు ప్రదర్శించిన వినయం, సహనమే ఈ రోజు సినిమా ఈ స్థాయి విజయానికి చేరడానికి మరో ముఖ్య కారణమని, పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఈ చిత్రం మంచి కలెక్షన్లతో ముందుకు సాగడం ఇండస్ట్రీకి ఎంతో శుభపరిణామమని ఆయన ప్రశంసించారు.
అనంతరం దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా చిత్ర హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ లక్ష రేట్లు ఎక్కువ ఉందని, అందుకే ప్రసన్న కుమార్ వంటి పెద్దల సూచన మేరకే ఆమెకు సారీ చెప్పడం జరిగిందని స్పష్టం చేశారు. అంతేకానీ ఈ సమస్య పూర్తిగా సర్దుమణిగిందని తాను భావించడం లేదని, మొత్తానికి ఒక పెద్ద వివాదంతో సతమతం అయ్యామని, చివరికి ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన విజయంతో ఈ వివాదానికి శుభం కార్డు పడిందని భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోందని, మాస్, క్లాస్ అనే తేడా లేకుండా థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం పాజిటివ్ టాక్ కారణంగానే విడుదలైన రెండవ రోజు నుంచే థియేటర్ల సంఖ్య భారీగా పెరిగిందని పేర్కొన్నారు.
దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా మూడు బాధ్యతలు నిర్వహించినందున ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని, చిత్రబృందంలోని ప్రతి ఒక్కరి కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని సంజీవ్ మేగోటి అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారికి నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి ఈత మునకల స్పందన లభిస్తోందని, థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు సంతృప్తిగా నవ్వుతూ మాట్లాడటం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కేవలం 45 రోజుల్లోనే 52 మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్రీకరణ పూర్తి చేశామని, ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఒక సరికొత్త వైవిధ్యమైన కాన్సెప్ట్ ఆధారంగా ఈ కథను సిద్ధం చేశామని చెప్పారు. హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో సమన్వయం చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచామని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తలవంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు.
ఈ వేడుకలో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదని, దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారని కొనియాడారు. తన ఆరాధ్య దైవం, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణగారిని గుర్తు చేసే పాటలో నటించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని, ఇది కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేసే అచ్చమైన వినోదాత్మక చిత్రమని అన్నారు. సీనియర్ నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ సినిమా విడుదలయ్యాక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు, స్నేహితులు స్వయంగా ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని, ఈ క్రేజీ ప్రాజెక్టులో తనకు మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. మరో నటుడు విజయభాస్కర్ మాట్లాడుతూ కర్మ సిద్ధాంతం ఆధారంగా తెరకెక్కిన ఈ కథ వినగానే కనెక్ట్ అయ్యానని, గతంలో తాను నటించిన ‘బతుకమ్మ’ సినిమా తర్వాత తనకు నటుడిగా ఈ స్థాయిలో ఆత్మసంతృప్తినిచ్చిన చిత్రం ఇదేనని, తాను చేసిన పోలీస్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద చిత్రాలకు ధీటుగా భారీ స్థాయిలో విడుదల చేశామని, అనుకున్నట్లుగానే పాజిటివ్ టాక్‌తో సినిమా థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోందని చెప్పారు. నిర్మాత ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారని, ప్రేక్షకులు అందిస్తున్న ఈ ఆదరణ తమకు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని ఇస్తోందని ముగించారు.
హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల పర్ఫెక్ట్ మిశ్రమంగా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ప్రస్తుతం అన్ని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయిలతో పాటు రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి భారీ తారాగణం నటించగా, ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఛాయాగ్రహణం అందించారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో సంయుక్తంగా సంగీతాన్ని సమకూర్చారు.