Meenakshi chaudhary | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా తన పేరుతో జరుగుతున్న సైబర్ మోసంపై స్పందిస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా విస్తరణతో పాటు సెలబ్రిటీల పేర్లను, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తాజాగా మీనాక్షి కూడా అలాంటి ఒక ఫేక్ అకౌంట్ వ్యవహారానికి గురయ్యారు. కొంతమంది కేటుగాళ్లు మీనాక్షి చౌదరి పేరు, ఫోటోలు మరియు ఒక ఫోన్ నంబర్‌ను ఉపయోగించి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు, సాధారణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయం హీరోయిన్ దృష్టికి రావడంతో వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ నకిలీ నంబర్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ కీలక హెచ్చరిక జారీ చేశారు.
ఈ నంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే దయచేసి నమ్మకండి. అది నా అధికారిక నంబర్ కాదు. వెంటనే ఆ నంబర్‌ను రిపోర్ట్ చేయండి అంటూ మీనాక్షి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెలబ్రిటీల పేర్లను ఉపయోగించి మోసాలు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ‘ఫెమినా మిస్ ఇండియా 2018’ రన్నరప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి, మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్నారు.
అనంతరం అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రంలో నటించి కెరీర్లో తొలి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మీనాక్షి, టాలీవుడ్ నిర్మాతలు మరియు దర్శకుల దృష్టిని ఆకర్షించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన మీనాక్షి, తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఆమె నటనకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.ఆ తర్వాత వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల విజయాలతో మీనాక్షి వరుస హిట్లను ఖాతాలో వేసుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.