అమరచింత : అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను ( General Strike ) విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్( Ajay) పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఉద్యోగులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులతో కలిసి ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మయ్యకు సమ్మె నోటీసులు ( Strike Notice ) అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్, మండల అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజుకు రూ. 600 వేతనం చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల బకాయిలను చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోహన్ తదితరులు ఉన్నారు.