రామగిరి, మార్చి 11 : నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన భూ ఆక్రమణ, ప్రాణహాని ఫిర్యాదుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) స్పందించింది. తన భూమిని ఆక్రమించడమే కాకుండా హతమార్చుతామని బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన పాతకోట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నెల 11న కమిషన్కు ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని, తన భూమి ఆక్రమణకు గురవుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్లోని కమిషన్ ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన సంఘటన, తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP)లను ఆదేశించారు.
– ఎఫ్ఐఆర్ వివరాలు : కేసు నమోదు వివరాలు, సెక్షన్లు, నిందితుల అరెస్ట్ వివరాలను తెలియజేయాలి
– పరిహారం : బాధితుడికి ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అందాల్సిన పరిహారం వివరాలు
– హెచ్చరిక : నిర్ణీత సమయం లోగా నివేదిక అందకపోతే, అధికారులకు వ్యక్తిగత సమన్లు జారీ చేస్తామని హెచ్చరిక
ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, బాధితుడికి న్యాయం జరిగే వరకు విచారణ కొనసాగుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.