‘ఈ జీవితం ఎవరిది?’ అదేం ప్రశ్న! మనదే.‘అందులో అతిముఖ్యమైన వ్యక్తి ఎవరు?’ బరాబర్ మనమే.మన అహానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాం. అభిమానాన్ని బట్టి అనుబంధాలను కొనసాగిస్తాం. సర్వేంద్రియాలనూ మన తృప్తికే వినియోగిస్తాం. కానీ… అదంతా పైపైనే! లోలోపల మాత్రం మన అందం మీద న్యూనత, ఎదుగుదల పట్ల అసంతృప్తి. నిరంతరం మన బలహీనతలను తలుచుకుంటూ, ఇతరులతో పోల్చుకుంటూ మగ్గిపోతుంటాం. ఫలితం! నిస్సారమైన బతుకు. చాలా సందర్భాలలో ఈ స్వీయ ద్వేషం ఆత్మహత్యలకు సైతం దారితీస్తుంది. తనను తాను ద్వేషించుకునేవాడు ఇతరులను మాత్రం ఎలా ప్రేమించగలడు? కాబట్టి ఆ వ్యక్తి చుట్టూ ఉండే బంధాలలోనూ ఏదో నిరాశ. అందుకే ఇప్పుడు స్వీయ ప్రేమ (సెల్ఫ్ లవ్) గురించి చర్చ జరుగుతున్నది. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా.. యావత్ ప్రపంచమూ గులాబీల మత్తులో, కొటేషన్ల కసరత్తులో మునిగే వేళ… ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోమంటూ సెల్ఫ్ లవ్ ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నారు మానసిక వేత్తలు.
మనిషి లోకాన్నంతా చూస్తాడు కానీ తనలోకి తాను చూసుకునేందుకు, తనతో తాను గడిపేందుకు బిడియపడతాడు. నదీతీరాన నిలబడి కాళ్లు తడుపుకొన్నట్టు… తనలోకి తొంగిచూసే ప్రయత్నమే చెయ్యడు! మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే ‘ఆధ్యాత్మికత’ అన్న అభిప్రాయమూ ఉంది. మనల్ని మనం ప్రేమించుకోవడం అన్నది పచ్చి స్వార్థం కిందికే వస్తుందని కొందరి భయం. పరుల కోసమే జీవిస్తూ, నలుగురి కోసం తమ సర్వస్వాన్నీ అర్పించే జీవితాలే గొప్పవనే దురభిప్రాయమే ఇందుకు కారణం. ఇలా అనేకానేక కారణాల వల్ల ‘స్వీయ ప్రేమ’కు విలనీ క్యారెక్టర్ కట్టబెట్టేసింది సమాజం. నిజానికి ఈ సెల్ఫ్ లవ్ కొత్త మాటేమీ కాదు. ప్రపంచమంతా నీలోనే ఉందని భారతీయ తత్వం చెప్పనే చెప్పింది. ఆత్మారాముడు… అంటూ తన ఆత్మలోనే దైవాన్ని చూసే ప్రయత్నం చేసింది. గ్రీకు గురువు అరిస్టాటిల్ కూడా స్వీయ ప్రేమ వల్ల మంచే జరుగుతుందని తేల్చాడు. ఇప్పటిదాకా పరోక్షంగా మాట్లాడుకుంటున్న ఈ విషయం ఇప్పుడు ఓ ముఖ్యమైన వనరుగా మారుతున్నది. అందుకు కారణం లేకపోలేదు! ఉరుకులు పరుగుల జీవితం, చిన్న కుటుంబాలు, అవసరార్థపు బంధాలు, ఉద్యోగ ఒత్తిళ్లు, అనారోగ్యం, ఒంటరితనం… సవాలక్ష కారణాల నేపథ్యంలో మనిషిలో అసంతృప్తి పెరిగిపోతున్నది. స్వీయ ప్రేమే దీనికి పరిష్కారం. ఇంతకీ ఏమిటీ స్వీయ ప్రేమ? దాన్ని పెంచుకునేదెలా? మనల్ని మనం ఎందుకంతగా ద్వేషిస్తాం?ఈ ప్రశ్నే చాలా విచిత్రంగా ఉండవచ్చు. కానీ మనపట్ల మనకు తెలియని ఓ అసహనం అంటూ ఉంటుంది. కావాలంటే, ఓ కాగితం తీసుకుని కారణాలు రాసి చూడండి. వాటిలో ఈ అంశాలు కచ్చితంగా ఉండే ఆస్కారం లేకపోలేదు.
అసంపూర్ణ వ్యక్తిత్వం
ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. తనవైన బలాలు, బలహీనతలు ఉంటాయి. లోలోపల పేరుకుపోయిన బలహీనతలను దాటడం అంత తేలిక కాదు. చాలా సాధారణంగా కనిపించే భయం, ఆందోళన, బిడియం లాంటి లక్షణాలు కూడా జీవితంలో ఎదుగుదలను తీవ్రంగా అడ్డుకుంటాయి. సహజంగానే తనలోని ఈ లొసుగులను చూసి న్యూనతకు లోనవుతాడు.
పోలిక
ప్రపంచీకరణ పుణ్యమాని వస్తు వ్యామోహానికి అంతు లేకుండా పోయింది. వంద రూపాయలకు కూడా ఒక వాచ్ వస్తుంది… కోటి రూపాయలకూ ఒక వాచ్ వస్తుంది. తన దగ్గర ఉన్నవాటిని పదిమందికీ చూపించుకోవడానికి సామాజిక మాధ్యమాలూ పెరిగిపోయాయి. దాంతో మనుషుల మధ్య ఎప్పుడూ లేనంత పోటీ కనిపిస్తున్నది. మనసుకు ఎంతలా సర్ది చెప్పుకున్నా ఆరాటం తగ్గడమే లేదు!
శరీరాకృతి
సమాజం అందానికి ఓ నిర్వచనం ఇచ్చి వదిలేస్తుంది. ఆ లెక్కల్లో మనల్ని మనం తూచుకుంటూ ఉండిపోతాం. ఆత్మవిశ్వాసమే నిజమైన అందమని పైకి చెప్పుకొన్నా శరీరాకృతి, నలుపు-తెలుపులు బేరీజు వేసుకుంటూ ఎక్కడో తక్కువతనంగా భావిస్తూ మన శరీరాన్ని మనమే ద్వేషించుకుంటాం.
బాల్యం
చిన్ననాటి అనుభవాలు మనసు మీద ప్రగాఢంగా నిలిచిపోతాయి. చాలా సందర్భాల్లో బాల్యపు చేదు జ్ఞాపకాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన నుంచి మనమే దూరమయ్యేంతగా బాధపెడతాయి.
ప్రతికూల వ్యక్తిత్వాలు
మన జీవితంలో తారసపడే బంధాలు, వ్యక్తిత్వాలు.. అన్నీ సానుకూలంగా ఉండాలని లేదు. మన మీద ఆధిపత్యం చూపించి, ఏడిపించి… ఏమాత్రం జాలి లేకుండా ప్రవర్తించే మనుషుల మధ్య జీవించాల్సి రావచ్చు.
పరాజయాలు
జీవితమన్నాక ఎదురుదెబ్బలు తప్పవు. కానీ కొన్ని సందర్భాల్లో ఊహించని పరాజయం పరీక్ష పెడుతుంది. అప్పటిదాకా సాఫీగా సాగిపోతున్న కెరీర్ లేదా బంధంలో తీవ్రమైన ఒడుదుడుకులు తలెత్తుతాయి. మనవైపు ఏదో పొరపాటు, లోపం ఉందనే ద్వేషాన్ని రగిలిస్తాయి.
ఇలా పెంచుకోవాలి..
స్వీయ ప్రేమ అంటే… తన మానసిక, భౌతిక అవసరాలను కచ్చితంగా గుర్తించే ప్రయత్నం. ఇతరుల మెప్పు గురించి మాత్రమే కాకుండా మన సంతోషం, సంతృప్తి గురించి ఆలోచించడం. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం బేరీజు వేసుకోవడంలో రాజీపడకపోవడం! మరి దాన్ని సాధించేదెలా..?
మాట్లాడే తీరు
మాట్లాడటం అంటే బయటి వాళ్లతో మాత్రమే కాదు… మనతో మనమూ మాట్లాడుకుంటూ ఉంటాం. చర్చించుకుంటాం. నిందించుకుంటాం. దీన్నే ‘స్వీయ భాషణం’ (సెల్ఫ్ టాక్) అంటారు. కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకోం. లోలోపల జరిగే సంభాషణను గమనించినప్పుడు మనతో మనం ఎంత కఠినంగా ఉంటున్నామో తెలిసిపోతుంది. అందులో వినిపించే మాటలు (ఉదా: నేను ఓడిపోవడానికే పుట్టాను, నేను అందంగా ఉండను, నేను పనికిరానివాడిని, నన్ను ఎవ్వరూ ఇష్టపడరు…) మనపట్ల మన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాయి. ఆ ప్రతికూల వాక్యాలను, ద్వేషపూరితమైన వ్యక్తీకరణలను క్రమంగా తగ్గించుకోవాలి.
క్షమాపణ
శత్రువునైనా క్షమించగలం కానీ… మన తప్పులను మాత్రం చచ్చేవరకూ గుర్తుచేసుకుంటూ ఉంటాం. మనం నిరంతరం స్వీయ నిందలో మునిగితేలుతూ ఉంటాం. పశ్చాత్తాప భారాన్ని పెంచుకుంటూనే ఉంటాం. వాటి వల్లే మన జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఒక్కసారి మన తప్పులన్నీ నెమరేసుకుని.. పొరపాట్లు చేయడం కూడా ఎదగడంలో ఓ భాగమని నచ్చ చెప్పుకుని.. ‘నన్ను నేను క్షమించేసుకుంటున్నాను’ అని మన
స్ఫూర్తిగా అనుకుంటే భారం తగ్గుతుంది.
డిజిటల్ పరిమితులు
ఆఫీసులో ఉన్నంతసేపూ కంప్యూటర్ ముందు, ఇంటికి వచ్చాక టీవీతో, ఆపై మొబైల్. మన జీవితాన్ని మనతోనూ కాక, ఇతరులతోనూ కాక.. ఓ తెరతో పంచుకోవడం నిజంగానే దురదృష్టకరం. డిజిటల్ తెరల వెలుతురుతో మన హార్మోన్లు, శరీర శ్రమల మీద ప్రతికూల ప్రభావం సరేసరి. అంతేకాదు! సామాజిక మాధ్యమాల్లో కనిపించే లైకులు, బడాయి కబుర్లు, ఖరీదైన జీవితాలు… అన్నీ మనల్ని న్యూనతకు గురిచేస్తాయి. స్క్రీన్ టైమ్‌కి పరిమితులు విధించుకోవడం తప్పనిసరి.
నిన్ను నిన్నుగా ప్రేమించుటకై!
శారీరకంగా, వ్యక్తిత్వపరంగా రకరకాల లోపాలు ఉండవచ్చు. కొన్నింటిని సరిదిద్దుకోలేం. మరికొన్నింటిని దారిన పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఆ మాటకొస్తే కొన్ని అసలు లోపాలే కాకపోవచ్చు. ఒక ఆత్మీయుడిని ఎలాగైతే… తన మంచిచెడులతో సహా యథాతథంగా ప్రేమిస్తామో, మనల్ని మనమూ అంతే నిర్మలంగా ప్రేమించుకునే ప్రయత్నం చేయాలి. ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే… నీ పొరుగువాడిని ప్రేమించు’ అని బైబిల్ సూక్తి. మనల్ని మనమే ద్వేషిస్తే… ఇక సాటి మనిషిపట్ల కరుణ ఎక్కడ ఉంటుంది?
మంచి మనసుల మధ్య‘నువ్వు ఎక్కువగా సమయం గడిపే ఓ అయిదుగురి సగటు వ్యక్తిత్వమే నీది’ అంటాడు జిమ్ రోన్ అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మన చుట్టూ ఉండే మనుషులు తప్పకుండా మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారు. డిప్రెషన్లో ఉన్న విద్యార్థులు స్నేహితులతో కాలం గడిపితే కనుక, చికిత్స అవసరం లేకుండానే వాళ్ల కుంగుబాటు తగ్గిపోతుందని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. పరిణతి కలిగిన వ్యక్తుల మధ్య ఉంటే తప్పకుండా మన మీద మనకు కూడా నమ్మకం, ప్రేమ కలుగుతాయి.
నిష్కర్షగా ఉండండి
మనసులో రకరకాల భావాలు చెలరేగుతూ ఉంటాయి. వాటిని ఒప్పుకొనేందుకు సంస్కారం అడ్డువస్తుంది. వాటిని అణచి వేసుకుంటే… మరింతగా చిరాకుపెడతాయి. కొత్తదారుల్లో బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాయి. అలా కాకుండా వాటిని గుర్తించి… మంచిచెడులను బేరీజు వేసినప్పుడే అక్కడితో తేల్చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మనసు కూడా నిర్మలం అవుతుంది. మన మీద మనకు తెలియని నమ్మకం ఏర్పడుతుంది.
మనసు మాట వినండి
ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో మనసు తన గొంతుకను వినిపిస్తూనే ఉంటుంది. కాకపోతే, మనం దాన్ని పట్టించుకోం. క్రమంగా మనసు గొంతుక పలచబడిపోతుంది. మనసు మాట వినడమూ ఒక కళే! రోజూ కొద్ది క్షణాలైనా మనుషులకు, మాధ్యమాలకూ కాస్త దూరంగా కొంచెం ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే… మనసు మాట స్పష్టంగా వినిపిస్తుంది. అదో సంభాషణలా సాగుతుంది. మన మాట మనమే వినకపోతే ఇంకెవరు వింటారు? ఆ ప్రయత్నం చేయాల్సిందే.
సంతోషాన్ని ఒడిసిపట్టుకోండి
మన జీవితంలో చాలా భాగం సమాజం కోసమో, మొహమాటంతోనో, భయంతోనో, సాంత్వన కోసమో (కంఫర్ట్ జోన్)… బతకడంతోనే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో తప్పకపోవచ్చు. కానీ మన నుంచి మనం ఎంత దూరం వెళ్లగలమో అన్న పరిమితిని విధించుకోవాల్సిందే. మన నైపుణ్యాలు, వ్యక్తిత్వం, పరిస్థితులను బట్టి… ఏం చేస్తే సంతోషంగా ఉంటామో, చేసే పని శ్రమగా కాకుండా తృప్తిగా కనిపిస్తుందో, గడిపే క్షణాలు పరిపూర్ణంగా తోస్తాయో అలాంటి జీవితం కోసం ప్రయత్నిస్తే మనతో మనం గడిపే సమయం పెరుగుతుంది.
మంచి అలవాట్లు
తెల్లవారు జామునే నిద్ర లేవడం, వ్యాయా మం చేయడం, పోషకాహారం తీసుకోవడం… ఇవన్నీ పైపైకి మంచి అలవాట్లలాగే కనిపించవచ్చు. వాటి ప్రభావం మనసు మీద కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. జీవ గడియారాన్ని అనుసరించి సాగే దినచర్య, ఆరోగ్యవంతమైన శరీరం మనసును కూడా నిర్మలంగా ఉంచుతాయి.
ఇంతేనా! స్వీయ ప్రేమకు సంబంధించి ఇంకా చాలా ఉపాయాలే కనిపిస్తాయి. ఎప్పుడూ అన్యమనస్కంగా కాకుండా ఎరుకతో ఉండే ప్రయత్నం చేయడం, మనసులో ఆలోచనలను కాగితం మీద పెడుతూ ఉండటం, ప్రతి రోజూ కొంత సమయాన్ని ఏకాంతం కోసం కేటాయించడం, చిన్నచిన్న విజయాలకు మనల్ని మనం అభినందించుకోవడం, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సహనంతో ఉండటం లాంటి మార్గాలన్నీ స్వీయ ప్రేమను పెంచేవే!
స్వీయ.. ప్రేమాసనాలు
ఒకే స్థితిలో ఉండటం ఆసనం. మనం వేసే ఆసనాలను బట్టి ఒక్కో శరీరభాగంలో రక్తప్రసరణ, కండరాల మీద ఒత్తిడి కలిగి నిర్దిష్టమైన ఫలితాలు వస్తాయి. యోగశాస్త్రం కేవలం ఆసనాలకే పరిమితం కాదు. జీవన విధానంలో సమూలమైన మార్పులు తెచ్చే యమం, నియమం లాంటి సూచనలు చేస్తుంది. ఇక యోగా సనాల వల్ల శారీరక స్వస్థతే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. భారతీయ గురువులు ఏం చెప్పారో కానీ పాశ్చాత్య యోగ నిపుణులు మాత్రం కొన్ని యోగాసనాలు స్వీయ ప్రేమను పెంపొందిస్తాయని చెబుతున్నారు. ఉష్ర్టాసనం, ధనురాసనం, నౌకాసనం, త్రికోణాసనం, గరుడాసనం, భుజంగాసనం… అన్నీ మన హృదయాన్ని విశాలం చేస్తూ స్వీయ ప్రేమను పెంచుతాయనే నమ్మకం పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది.
ఆహారంలో
స్వీయ ప్రేమను ఆహారానికి అన్వయిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఆకలిగా ఉందని శరీరం చెప్పే మాటను ఆలకించి, అందుకు తగినట్టుగానే ఆహారం తీసుకోవాలి. తినేటప్పుడు మాట్లాడుతూనో, టీవీ చూస్తూనో, ఆలోచిస్తూనో కాకుండా… రంగు, రుచిని గమనిస్తూ ఆస్వాదించాలి. ఆ ఆహారం మన శరీరంలో కలుస్తున్న భావనను ఆస్వాదించాలి. నిదానంగా తింటూ, కడుపు నిండిన సూచనను గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా… ఆహారం విషయంలో మన శరీరాన్ని గౌరవించాలి. కేవలం నాలుక రుచికే లోబడితే మిగతా శరీరం దారితప్పడం ఖాయం. అపరిమితమైన ఆహారం, జంక్ ఫుడ్, హద్దులు దాటిన ఉప్పు, రకరకాల మార్గాల్లో చక్కెర ఉన్న, పీచు లేని పదార్థాలు… నిరంతరం వీటితోనే కడుపు నింపే ప్రయత్నం చేస్తే మాత్రం అనారోగ్యం ఖాయం. దాంతోపాటు వ్యాధులూ పలకరిస్తాయి. అందుకే మన శరీరాన్ని ప్రేమిస్తూ, దాని అవసరంగా ఆహారాన్ని భావిస్తుంటే ఆరోగ్యం మెరుగై తీరుతుంది.
హద్దులు దాటితే!
గ్రీకు పురాణాల్లో నార్సిసస్ అనే పాత్ర ఉంది. కండ్లు మిరుమిట్లు గొలిపే సౌందర్యం ఆ యువకుని సొంతం. తనని చూసిన ఎకో అనే అమ్మాయి ప్రేమలో పడిపోయింది. కానీ నార్సిసస్ ఆమె ప్రేమని తిరస్కరించడమే కాకుండా, ఆమె మనసు నొప్పించేలా మాట్లాడతాడు. ఫలితంగా…‘మరొకరి ప్రేమను గుర్తించలేనివాడు, తనతో తనే ప్రేమలో పడిపోతాడు’ అనే శాపాన్ని పొందుతాడు. అందుకు తగినట్టుగానే ఒక కొలనులో తన రూపాన్ని చూసుకుని దాన్నే ప్రేమించడం మొదలుపెడతాడు. ఆ రూపం తిరిగి తనను ప్రేమించడం లేదని తెలిసి వేదనతో రగిలిపోతూ… ఆ ప్రతిబింబం వంకే చూస్తూ చనిపోతాడు. మరోవైపు ఎకో కూడా భగ్న హృదయంతో చనిపోయి కేవలం ఒక ధ్వనిగానే మిగిలిపోతుంది. ఎవరైనా తమను తాము విపరీతంగా ప్రేమించుకుంటూ, తమ అవసరాలే ముఖ్యంగా భావించుకుంటూ ఉంటే… ఆ లక్షణానికి ‘నార్సిసిజం’ (స్వానురక్తి) అని పేరు పెట్టారు సైకాలజిస్టులు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి ప్రముఖులంతా దీన్ని సిద్ధాంతీకరించారు. మొదట్లో నార్సిసిజం భావననే వ్యతిరేకించిన పరిశోధకుల ఆలోచనలోనూ తాజాగా మార్పు వచ్చింది. ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత స్వీయ ప్రేమ ఉండి తీరుతుందనీ… అది తగిన స్థాయిలో ఉండటం చాలా ఆరోగ్యకరమని గుర్తిస్తున్నారు.
లాభాలెన్నో
న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం.. స్వీయ ప్రేమ వల్ల కుంగుబాటు, ఆందోళన లాంటి మానసిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. జీవితం పట్ల ఆశావహ దృక్పథం కూడా పెరుగుతుంది.
స్వీయ ప్రేమ లేని వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతాడు. అడుగడుగునా అనుమానపడతాడు. దానికి కారణం… తనకంటూ ఓ స్పష్టత, తన మీద తనకు నమ్మకం లేకపోవడమే! కానీ తన మనసు మాట వింటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్న రోజున కెరీర్పరంగానూ, జీవితంలోనూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడు. చాలా మంది విజేతల మాటలు విన్నప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
మన మీద మనకు నమ్మకం లేకపోవడం…వాయిదా మనస్తత్వానికి దారితీస్తుంది. దానివల్ల తాత్కాలికమైన తృప్తి కలిగినా… వాయిదా వేసిన పని, మనసు మీద మరింత ఒత్తిడి కలిగిస్తుంది. స్వీయ ప్రేమ ఈ విష వలయాన్ని ఛేదించేందుకు సాయపడుతుందని చెబుతున్నారు లిండా గ్రాహమ్ అనే సైకాలజిస్ట్. స్వీయ ప్రేమ వల్ల అప్పటివరకూ చేసిన తప్పులను ఒప్పుకొని, మనల్ని మనం క్షమించుకుని… అడుగు ముందుకు వేసేందుకు కావల్సిన నమ్మకం కలుగుతుంది.
స్పెయిన్‌కు చెందిన ఓ పరిశోధన… స్వీయ ప్రేమతో మన మీద మనకు నమ్మకం పెరగడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయంలో తప్పులు చేసే అవకాశం చాలా తగ్గుతుందని తేల్చింది. ఇందుకు కచ్చితమైన ఆధారాలు కూడా లభించాయి. మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు హెచ్చరికగా మెదడు ‘ఎర్రర్ రిలేటెడ్ నెగెటివిటీ’ అనే సూచన అందజేస్తుందట. తమని తాము ప్రేమించుకునే వారిలో ఈ సూచనలు చాలా బలంగా ఉన్నట్టు తేలింది.
తనపట్ల సానుకూలంగా ఉండేవారిలో కష్టాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు పరిశోధకులు, విడాకులు తీసుకున్న కొందరిని పదినెలల పాటు గమనించారు. జరిగిన పొరపాటును నిందించుకుంటూ గడిపిన వారికంటే, తనపట్ల మరింత కరుణతో మెలిగేవారే ఆ కష్టం నుంచి త్వరగా తేరుకోవడాన్ని గమనించారు.
మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మరొకరి మెప్పు కోసం ఎదురుచూస్తాం. వాళ్లు ప్రోత్సహిస్తేనే ముందుకు అడుగు వేస్తాం. మన విలువను కూడా వాళ్ల కళ్ల నుంచే చూస్తాం. మన సుఖసంతోషాలన్నీ ఆయా బంధాల మీదే ఆధారపడతాయి. కానీ స్వీయ ప్రేమలో తృప్తిని తెలుసుకున్న రోజు, మన తొలి బంధం మనతోనే అని గ్రహిస్తాం. మన మీద మనం ఆధారపడే ప్రయత్నం చేస్తాం.
‘ఏదో ఇలా కాలం గడిపేస్తున్నాం’ అన్న నిస్పృహ చాలామందిలో కనిపిస్తుంది.
కానీ స్వీయ ప్రేమతో భయం, పశ్చాత్తాపం లాంటి భావాలు పలచబడతాయి. ఫలితంగా మన జీవితం మీద ఓ సాధికారత ఏర్పడుతుంది.
ఇవీ స్వీయ ప్రేమకు సంబంధించిన కొన్ని విషయాలు. జీవితంలో సంక్లిష్టత పెరుగుతున్న కొద్దీ… బయటి లోకం మీద ఆశలు పెంచుకుని ఉసూరుమంటున్న
కొద్దీ స్వీయ ప్రేమ గురించి ఎరుక పెరుగుతున్నది. ఇదే అదనుగా ‘ఆపరేషన్ సెల్ఫ్ లవ్’, ‘సెల్ఫ్ లవ్ ప్రాజెక్ట్’ లాంటి శిక్షణ కార్యక్రమాలూ వెల్లువెత్తుతున్నాయి.
ఇక పుస్తకాలు, వ్యాసాలు సరేసరి. ఇవన్నీ చెప్పే తొలి సూత్రం ఒకటే.. ఇప్పటిదాకా బయటికి చూసింది చాలు. ఒకసారి మీలోకి మీరు చూసుకోండి. ‘నేను’ అనే లోకంలో ఏం జరుగుతున్నదో గమనించే ప్రయత్నం చేయండి. స్వీయ ప్రేమ దానంతట అదే కలుగుతుంది.
ఆపరేషన్ ‘బ్యూటిఫుల్’
స్వీయ ప్రేమను పెంచుకునేందుకు రకరకాల చిట్కాలు ఉన్నాయి. అడపాదడపా ఉద్యమాలూ జరుగుతున్నాయి. వాటిలో ఒకటే ‘ఆపరేషన్ బ్యూటిఫుల్’. ఫ్లోరిడాకు చెందిన కేట్లిన్ బోయెల్‌కు తన మీద తనకే తీవ్రమైన ద్వేషం. అది క్రమంగా కుంగుబాటుకు దారితీసింది. చదువుకునే వయసు. ఏం చేయాలో ఎవరి సలహా తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదైనా ఉద్యోగం చేస్తూ తీరిక లేకుండా ఉంటే… మనసులో చిరాకు తగ్గుతుందని ఓ పార్ట్‌టైమ్ కొలువులో చేరింది. ఆ బాధ్యత మరింత ఒత్తిడి పెంచింది. ఇటు చదువులోనూ వెనుకబడిపోయింది. ఓరోజు కాలేజీకి వెళ్లేసరికి కెమిస్ట్రీలో అత్తెసరు మార్కులు పలకరించాయి. లోకమంతా తన మీద పగపట్టిన భావన. బాత్రూంలోకి వెళ్లి, అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోగానే జాలి, ద్వేషం ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఏడుపు ముంచుకొచ్చింది. ఆ వెంటనే ఎందుకనో తనను తాను ద్వేషించుకోవడం తెలివితక్కువ వ్యవహారమని అనిపించింది. వెంటనే తన బ్యాగ్‌లోంచి ఒక స్టిక్ నోట్ తీసి ‘నువ్వు అందంగా ఉంటావు’ అంటూ తన ప్రతిబింబం పక్కన అంటించింది. అలాంటి మాటలు తననే కాదు… వాటిని చూసిన ప్రతి ఒక్కరి మీదా ప్రభావం చూపిస్తాయి కదా! అనిపించింది. వెంటనే ‘ఆపరేషన్ బ్యూటిఫుల్’ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ‘మీరు అద్భుతాలు చేయగలరు’, ‘ఇవాళ మీ రోజు చాలా బాగుంటుంది’, ‘సానుకూలంగా ఆలోచించండి’ లాంటి స్టిక్ నోట్స్ రాసి బహిరంగ ప్రదేశాల్లో అంటించడం మొదలుపెట్టింది. క్రమంగా వీటిని చూసి వేలమంది అలాంటి మాటలే రాయడం మొదలుపెట్టారు. ఆ ఉద్యమం పలచబడినా… దాని స్ఫూర్తి, ప్రభావం మాత్రం ఇప్పటికీ అమెరికన్ల గుండెల్లో ఉండిపోయాయి.