తొర్రూరు, జనవరి 28: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను మొదలుపెట్టడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయంతో పల్లెలు పూర్వవైభవాన్ని సంతరించుకొంటాయని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ (టాటా) మాజీ అధ్యక్షురాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేట) చైర్మన్, రాజ్ ప్రాపర్టీస్ ఎండీ హనుమాండ్ల ఝాన్సీలక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంకు చెందిన ఆమె ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె భర్త డాక్టర్ రాజేందర్‌రెడ్డి అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణుడు. ఈ దంపతులు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 6 గ్రామాల్లో వివిధ పాఠశాలలకు దాదాపు రూ.2 కోట్ల సొంత నిధులతో భవనాలు నిర్మించి ఇచ్చారు. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఏటా రూ.2 లక్షల స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఉన్నత చదువులు చదివే పేద పిల్లలకు ఫీజులు చెల్లిస్తున్నారు. తొర్రూరులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవన నిర్మాణానికి నిధులిస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’పై ఝాన్సీలక్ష్మిరెడ్డి తన అభిప్రాయాలను ఫోన్ ద్వారా ‘నమస్తే తెలంగాణ’కు తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కొత్త వెలుగులు సంతరించుకొంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వం ఆశయం సఫలీకృతమై బడులు బాగుపడాలంటే ప్రజలు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో అవసరం. గ్రామాల్లోని పేద, మధ్య తరగతి వర్గాలవారు తమ పిల్లల చదు వు కోసం పట్నం బాట పడుతున్నారు. సిటీల్లోని అద్దె ఇండ్లలో ఉంటూ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ఆగచాట్లు పడుతున్నారు. దీంతో గ్రామాల్లోని సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని సర్కారీ బడుల్లోనూ ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టాలన్న నిర్ణయం హర్షణీయం. ఈ నిర్ణయంతో పట్టణాలకు వలసలు ఆగిపోతాయి. పల్లెలన్నీ పూర్వవైభవాన్ని సంతరించుకొంటాయి.
ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌ను నేర్చుకొంటే ప్రపంచంలో ఎక్కడైనా ధీమాగా బతికేయవచ్చు. గ్రామీణ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వస్తే పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే పెరుగుతారు. దీంతో మమతానుబంధాల విలువ తెలిసి వారిలో ఉన్నత భావాలు ఏర్పడతాయి. కుటుంబంతోపాటు ఊరికి, సాటివారికి అండగా నిలవాలన్న భావన పెరుగుతుంది. తద్వారా యావత్ సమాజం బాగుపడుతుంది.