Beetroot Supplements | మార్కెట్లో అందుబాటులో ఉన్న బీట్ రూట్ సప్లిమెంట్లు.. ఇవి శరీరానికి ఏ మేర మేలు చేస్తాయి, వీటిని తీసుకోవ్చా..?
బీట్రూట్ను ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు. రక్త ప్రసరణను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యానికి తోడ్పడటం, వ్యాయామ సమయంలో శక్తి సామర్థ్యాలను పెంచడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం బీట్రూట్లోని పోషకాలను అధిక సాంద్రతలో అందించే క్యాప్సూల్స్ కూడా సప్లిమెంట్లుగా అందుబాటులో ఉన్నాయి.
Beetroot Supplements | బీట్రూట్ను ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు. రక్త ప్రసరణను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యానికి తోడ్పడటం, వ్యాయామ సమయంలో శక్తి సామర్థ్యాలను పెంచడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం బీట్రూట్లోని పోషకాలను అధిక సాంద్రతలో అందించే క్యాప్సూల్స్ కూడా సప్లిమెంట్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అవసరం లేకుండా లేదా వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. బీట్రూట్ క్యాప్సూల్స్‌లో బీట్రూట్ సారాన్ని అధిక సాంద్రతలో ఉపయోగిస్తారు. వీటిలో ప్రధానంగా నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను సడలించడంలో సహాయపడతాయి. తద్వారా రక్త ప్రసరణకు, గుండె పనితీరుకు కొంత మద్దతు లభిస్తుంది. శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడటంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.
స్టామినా పెరిగేందుకు..
బీట్రూట్ క్యాప్సూల్స్ వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వ్యాయామ సమయంలో శరీరానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి, స్టామినాను పెంచడానికి ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం తీసుకునే మోతాదు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మందగించే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా బీట్రూట్లోని నైట్రేట్లు కొంత ప్రయోజనం అందిస్తాయి. అంతేకాకుండా బీట్రూట్లో బీటలైన్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అయితే బీట్రూట్ క్యాప్సూల్స్ కంటే తాజా బీట్రూట్ను ఆహారంలో భాగంగా తీసుకోవడం పోషకపరంగా మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. తాజా బీట్రూట్లో ఫైబర్‌తోపాటు వివిధ విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. క్యాప్సూల్స్‌లో మాత్రం బీట్రూట్ సారం మాత్రమే అధిక సాంద్రతలో ఉంటుంది. శరీరం దానిని ఎంతవరకు గ్రహించి, ఆశించిన ప్రయోజనాలను అందుకుంటుందనేది వ్యక్తి వ్యక్తికి మారే అవకాశం ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం..
బీట్రూట్ క్యాప్సూల్స్‌కు నిర్ణీతంగా ఒకే మోతాదు ఉండదు. క్యాప్సూల్‌లో ఉన్న బీట్రూట్ సారం పరిమాణం, నైట్రేట్ మోతాదు, తయారీదారు సూచనలు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను బట్టి మోతాదు మారుతుంది. అందువల్ల ప్యాక్‌పై సూచించిన మోతాదును మించి తీసుకోకూడదు. ముఖ్యంగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని ఉపయోగించడం మంచిది. బీట్రూట్ క్యాప్సూల్స్ కొందరిలో దుష్ప్రభావాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీట్రూట్లోని సహజ వర్ణద్రవ్యాల కారణంగా మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని బీట్యూరియా అంటారు. సాధారణంగా ఇది ప్రమాదకరం కాకపోయినా, ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. కొన్ని మందులతో బీట్రూట్ క్యాప్సూల్స్ పరస్పర చర్యకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటును తగ్గించే మందులు, నైట్రేట్ కలిగిన కొన్ని మందులను వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. బీట్రూట్లోని నైట్రేట్లు రక్తనాళాలను సడలించడంతో రక్తపోటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
ఎవరు తీసుకోకూడదు..
తక్కువ రక్తపోటు ఉన్నవారు, మూత్రపిండాల వ్యాధి కారణంగా ఆహార నియంత్రణ పాటిస్తున్నవారు, గతంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడినవారు, కొన్ని రకాల గుండె సమస్యలు ఉన్నవారు బీట్రూట్ క్యాప్సూల్స్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఒకేసారి పలు రక్తపోటు మందులు వాడుతున్నవారు కూడా స్వయంగా ఈ సప్లిమెంట్లను ప్రారంభించకూడదు. ఆహారం ద్వారా ఇప్పటికే తగినంత పోషకాలు అందుతున్న ఆరోగ్యకరమైన వ్యక్తులకు బీట్రూట్ క్యాప్సూల్స్ తప్పనిసరి కాదు. రోజువారీ ఆహారంలో కూరగాయలు, నైట్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తగినంతగా తీసుకుంటున్నవారికి అదనంగా సప్లిమెంట్ తీసుకునే అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకమైన వైద్య లేదా వ్యాయామ సంబంధిత అవసరం లేని వారు కూడా వీటిని అనవసరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీట్రూట్ క్యాప్సూల్స్ రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం, వ్యాయామ సామర్థ్యానికి కొన్ని ప్రయోజనాలు అందించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ ఇవి అవసరం అని చెప్పలేం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు తాజా బీట్రూట్ను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా సహజమైన పోషకాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

