సీఎం కేసీఆర్ పథకాలు అన్నివర్గాల ప్రజలకు దారి దీపమయ్యాయి. ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న కేసీఆర్ శ్రీకారం చుట్టిన మరో ప్రతిష్ఠాత్మక పథకం దళితబంధు. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఎస్సీల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీలు సర్కారు చేయూతతో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మొన్నటి దాకా ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ గడిపిన కుటుంబాల్లో.. ఇప్పుడు దళిత బంధు కాంతులు విరజిమ్ముతున్నాయి. యూనిట్లన్నీ సక్సెస్ కావడంతో .. మొన్నటి దాకా కూలీలుగా అవస్థలు పడ్డోళ్లే.. ఇయ్యాల దర్జాగా ఓనర్లుగా బతుకుతున్నారు. ఉన్న ఊళ్లోనే మంచి ఆదాయం గడిస్తున్నారు. ఉపాధి పొందుతూనే మరికొంత మందికి పని కల్పిస్తున్నారు. ఇప్పటికే తొలి విడుత దళితబంధు విజయవంతంగా అమలు కాగా.. రెండో విడుత అమలు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎన్నో అవమానాలు, ఎంతో వివక్షకు గురయ్యారు. ఉపాధి లేక అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కనీసం కూలిపని కూడా దొరుకని పరిస్థితి. పొద్దంతా పని చేసినా రోజుకు రూ.వంద కూడా గిట్టుబాటు అయ్యేది కాదు. కుటుంబం కూడా గడవలేని పరిస్థితి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో దళితుల్లో మార్పు వచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా అమలు చేసిన దళితబంధు విజయవంతంగా కొనసాగుతున్నది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 100 మందికి దళిత బంధు డబ్బులు గ్రౌండింగ్ అయ్యాయి. మునుగోడు మండలంలో 39 మందికి, నారాయణపురం మండలంలో 61 మందికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది. సర్కారు సాయంతో లబ్ధిదారులు కిరాణా దుకాణం, మెడికల్ సామాన్ల డీలర్షిప్, ప్లాస్టిక్ ప్లేట్లు, టీ కప్పుల తయారీ, డయాగ్నోస్టిక్స్, సెంట్రింగ్, కార్లు, డోజర్లు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆదాయం పొందుతున్నారు.
సర్కారు చేయూత, అధికారుల కృషితో దళితబంధు లబ్ధిదారులు లక్షాధికారులు అవుతున్నారు. వంద, రెండొందలకు కూలీలుగా పనిచేసిన వారు నేడు ఓనర్లయ్యారు. మునుగోడు మండలంలోని జమస్తాన్‌పల్లి గ్రామానికి చెందిన అందుగుల కృష్ణ అనే లబ్ధిదారుడు పౌల్ట్రీ ఫాం పెట్టి నడిపిస్తున్నారు. ఆయనకు అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.30వేల దాకా ఆదాయం వస్తున్నది. దాంతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇక మరికొందరికి నెలకు రూ.35వేలు, ఇంకొందరికి రూ.30 వేల ఆదాయం వస్తున్నది. ఇలా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో జమ చేస్తూ లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దళిత బంధుతో లబ్ధిదారులు ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి జాబ్ అవకాశాలు కల్పిస్తున్నారు. కొత్త కొత్త వ్యాపారాలు పెడుతుండడంతో ఇతర సిబ్బంది, వర్కర్లు అవసరం పడుతున్నారు. దీంతో మరికొందరికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఒక్కో యూనిట్లో నలుగురు నుంచి ఐదుగురు పని చేస్తున్నారు. కొన్ని యూనిట్లలో కార్లను రెంట్‌కు తీసుకొని నడిపిస్తుండడంతో బయట డ్రైవర్లకు కూడా ఉపాధి లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులు కాకుండా మరో వెయ్యి మందికి ఉపాధి దొరుకుతున్నది.
దళితబంధు రెండో విడుత అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. గతేడాది నియోజకవర్గానికి వంద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించగా.. ఈ సారి ఒక్కో నియోజకవర్గానికి 1,500 మంది ఎస్సీలకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో మొదట విడుతగా 500మందికి ఇస్తారు. ఆ తర్వాత దఫాలుగా మరో వెయ్యి మందికి ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.17,600 కోట్లు కేటాయించడమే కాకుండా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా విడుదలైంది.
క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార సమన్వయంతో పనిచేస్తున్నది. ఎస్సీ సంక్షేమ శాఖ.. మున్సిపల్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ ఇతర శాఖల అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటూ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ నేరుగా లబ్ధిదారులను కలుస్తున్నారు. అందుబాటులో ఉన్న లాభదాయకమైన ఉపాధి అవకాశాలపై అవగాహన కల్తిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో యూనిట్ ఎంచుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆయా రంగాల్లో లబ్ధిదారులకు శిక్షణ ఇస్తున్నారు.
మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 23గుంటల భూమి ఉంది. నేను పదేండ్ల నుంచి డ్రైవర్‌గా చేస్తున్న. ఐదేండ్ల కింద తూఫాన్ బండి తీసుకొని నడిపించా. బండి మాటిమాటికి చెడిపోతుండె. రిపేరు కోసం అప్పుల పాలైన. ఏమీ తోచని పరిస్థితిలో సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి దళితబంధు వరమిచ్చారు. ప్రభుత్వం రూ.10లక్షలతో చౌటుప్పల్‌లో బట్టల షాపు పెట్టుకున్న. దుకాణం బాగా నడుస్తున్నది. వచ్చిన డబ్బులతో ప్రతినెలా కొద్దికొద్దిగా అప్పులు కడుతున్న. దళితబంధు పథకం మా కుటుంబాన్ని సమాజంలో గౌరవంగా నిలబెట్టింది. మా చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది.
– బోడ రాజు, చిమిర్యాల గ్రామం (సంస్థాన్ నారాయణపురం)
రోజువారి కూలితో పూట గడవడం కష్టంగా ఉండేది. నాకు దళితబంధు మంజూరైంది. టెంట్ హౌస్, ఆటో, శుభకార్యాలకు డిజిటల్ సౌండ్ బాక్సులు కొని రెంట్‌కు ఇస్తున్న. ఒక్క యూనిట్లోనే మూడు వస్తువులు పెట్టడంతో సందర్భాన్ని బట్టి మాకు ఏదో ఒక గిరాకీ వస్తున్నది. ఒకరి కింద పని చేయకుండా అయ్యింది. సొంత కాళ్లపై నిలబడి, నెలకు దాదాపు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా సంతోషంగా సంపాదిస్తున్నాం. మా బాగు గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ సారుకు మేము అండగా ఉంటాం.
– అందుగుల రజిత, జమస్థాన్‌పల్లి రూరల్)
జీవనమే భారంగా భావించే మా దళితులు ఉన్నతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచించారు. నేను దళితబంధు పథకంలో పౌల్ట్రీ ఫాం పెట్టుకున్న. ఇప్పుడు గౌరవంగా బతుకుతున్న. మా జీవితాల్లో వెలుగులు నిండాయి. దళితుల ఇంటికి పెద్ద కొడుకులా ఆలోచించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే మేముంటాం.
– అందుగుల కృష్ణ, జమస్థాన్‌పల్లి
దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దళితబంధు ప్రవేశపెట్టడం అభినందనీయం. దీంతో అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10లక్షల యూనిట్ అందించి, భరోసాగా నిలువడంతో దళితుల బాధలు తీరుతున్నయి. దళితుల పక్షాన నిలబడే టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులంతా మద్దతుగా నిలబడుతారని భావించొచ్చు.
– గడ్డమీది రాజశేఖర్, సర్వేల్ గ్రామం నారాయణపురం)