Nagarjuna | అక్కినేని నాగార్జున ఆగస్ట్ 30న 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బర్త్ డే’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ నాగ్‌కు మద్దతు తెలిపారు. ఇక ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా తమ తండ్రికి స్పెషల్ విషెస్ అందజేశారు. ఈ సందర్బంగా, నాగార్జున అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా ‘రగడ’ సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. ఇక నాగార్జునకి ఈ పుట్టిన రోజు మరింత ప్రత్యేకంగా నిలిచింది. బయటకు వచ్చి అభిమానులని పలకరించి వారికి అభివాదం చేశారు.
ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన 100వ సినిమా “కింగ్ 100” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడిగా తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ ఎంపిక అయ్యారు. కథకి మంత్రముగ్ధుడైన నాగార్జున, ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున ఇటీవల ఒక టాక్ షోలో ఈ సినిమాను గురించి మాట్లాడారు. “పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో అద్భుతమైన సినిమా అవుతుంది. త్వరలోనే ‘కింగ్ 100’ సినిమాను ప్రారంభిస్తాం” అని చెప్పారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ నాగ్ పుట్టినరోజు సందర్భంగా వస్తుందని అనుకున్నారు. కాని అలాంటిది ఏమి జరగలేదు.
సాధారణంగా సినీ హీరోలు తమ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల గురించి అప్డేట్లు ఇస్తుంటారు, కానీ ఈసారి నాగార్జున తన అభిమానులని నిరాశపరిచాడు. “కింగ్ 100” సినిమా అనౌన్స్మెంట్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ లో కొంత నిరాశ అలుముకుంది. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, నాగార్జున సినిమా ప్రకటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నాగార్జున తన 100వ సినిమాను సరికొత్త శైలిలో, మరింత గ్రాండ్‌గా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో నాగ్ పెద్ద హిట్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.