e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ప్రభాస్‌ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి!

ప్రభాస్‌ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి!


దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సింపుల్‌గా కనిపిస్తారు. మినిమలిస్టిక్‌ లైఫ్‌ను (సాధారణ జీవితం) ఇష్టపడతారు. ఆయన ఆహార్యం మొదలుకొని జీవనశైలి వరకు ఎక్కడా హంగుఆర్భాటాలు అస్సలు కనిపించవు. అయితే సినిమాలపరంగా మాత్రం ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ప్రేక్షకులకు ఏదో కొత్త అనుభూతిని అందించాలనే నిరంతర ప్రయత్నాల్లో ఉంటారు. ‘మహానటి’ సినిమా ద్వారా జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్న ఈ యువదర్శకుడు తదుపరి ప్రభాస్‌తో పాన్‌ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసింది. నాగ్‌అశ్విన్‌ నిర్మాతగా అరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. అనుదీప్‌ కె.వి. దర్శకుడు. ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నాగ్‌అశ్విన్‌ పంచుకున్న ముచ్చట్లివి..

ప్రభాస్‌ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి!

ఈ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు…కథలో మీకు అంతగా నచ్చిన అంశాలేమిటి?
నాకు స్వతహాగా కామెడీ చాలా ఇష్టం. జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్ని చూస్తుంటే మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే వాళ్ల సినిమాల్లోని సన్నివేశాల్ని చూసినా రిలాక్స్‌గా ఫీలవుతాం. అలాంటి సంపూర్ణ వినోదభరితమైన సినిమా చేస్త్తే బాగుంటుందనిపించింది. దర్శకుడు అనుదీప్‌ను కలిసినప్పుడు రెండుమూడు స్క్రిప్ట్‌లు చెప్పాడు. అందులో ‘జాతిరత్నాలు’ బాగా నచ్చింది.
‘జాతిరత్నాలు’ కథ గురించి..?
రెండున్నర గంటలు నవ్వించడమే లక్ష్యంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేశాం. ముగ్గురు సిల్లీఫెలోస్‌ అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది. ఈ తరహా వినోదాన్ని అందించే సినిమా ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పొచ్చు. మనీ, అనగనగా ఒకరోజు తర్వాత ఆ రేంజ్‌లో వినోదాన్ని పంచే సినిమా ఇదని భావిస్తున్నా.
స్క్రిప్ట్‌పరంగా కాకుండా సెట్‌లో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు ఉంది?
దర్శకులు నిర్మాతలుగా మారడం కాస్త కష్టమైన విషయమే. ఎందుకంటే ప్రతి దర్శకుడికి ఓ విజన్‌ ఉంటుంది. మరో దర్శకుడు సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరి భావాలు సంఘర్షించకుండా చూసుకోవాలి. ఈ సినిమా విషయంలో నేను కేవలం డబ్బులు పెట్టి ఊరుకోలేదు. సృజనాత్మక, సాంకేతిక పరమైన అంశాల్లో టీమ్‌కు సహాయం చేశాను. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తూ నా ఐడియాల్ని షేర్‌ చేసుకున్నా.
సినిమా అవుట్‌పుట్‌ చూశాక నిర్మాతగా మీరు సంతృప్తి చెందారా?
దర్శకత్వం, నిర్మాణం ఏదైనా నేను ఓ ప్రేక్షకుడిగానే సినిమా చూస్తాను. నా దర్శకత్వంలో రూపొందే సినిమాల విషయంలో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి దృక్కోణం నుంచే వీక్షిస్తాను. నాలోని ప్రేక్షకుడు సంతృప్తి చెందితేనే సీన్‌కు ఓకే అంటాను. ఈ సినిమా అవుట్‌పుట్‌ చూశాకా బాగా వచ్చిందనిపించింది. గత ఏడాది విడుదలకావాల్సిన చిత్రమిది. లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. గత సంవత్సరకాలంగా ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆపుకోలేపోతున్నాం. వినోదాల పరిమళం తాజాగానే అనిపిస్తోంది.
మీరు భవిష్యత్తులో పూర్తిస్థాయి కామెడీ సినిమా చేసే ఆలోచన ఉందా?
కామెడీని నేను చాలా ఇష్టపడతాను. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ సినిమాలు సీరియస్‌ సబ్జెక్ట్స్‌ అయినా వాటిలో అంతర్లీనంగా మంచి హాస్యం ఉంటుంది. ఏదైనా విషయాన్ని సున్నితంగా, కామెడీ టచ్‌తో చెబితే ప్రేక్షకులు త్వరగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతాను. ప్రభాస్‌తో చేయబోయే సినిమాలో కూడా మంచి కామెడీ ఉంటుంది.
ఈ సినిమా కోసం ప్రభాస్‌ను రెండేళ్లు లాక్‌ చేశారని అంటున్నారు?
ప్రభాసే నన్ను రెండేళ్లు లాక్‌ చేశారు (నవ్వుతూ). సినిమా నాణ్యత విషయంలో ప్రభాస్‌ ఎప్పుడూ రాజీపడరు. నేనూ అదే విధంగా ఆలోచిస్తా కాబట్టి టైమ్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాను జూలైలో సెట్స్‌మీదకు తీసుకొస్తాం.
ప్రభాస్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తోంది?
ఆయన్ని కలిసే ముందు కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యాను. పెద్దస్టార్‌ కదా నన్నెలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకున్నా. అదీగాక నా స్టోరీ నరేషన్‌ కూడా సినిమాటిక్‌గా ఉండదు. కమర్షియల్‌ కోణంలో చెప్పలేను. దాంతో కథ ఎలా చెప్పాలో అనుకున్నా. అయితే ప్రభాస్‌ను కలిసిన తర్వాత చాలా కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. మరో విషయం ఏమిటంటే.. ప్రభాస్‌ బాక్సాఫీస్‌ లెక్కలు, వ్యక్తుల ఇమేజ్‌ల గురించి అస్సలు పట్టించుకోడు. సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌ లాంటి అంశాలపై కూడా పెద్దగా అవగాహన ఉండదు. తాను చేస్తున్న సినిమాలు, కొత్త కథల గురించి మాత్రమే మాట్లాడతాడు. ప్రభాస్‌ వంటి కూల్‌పర్సన్‌తో సినిమా చేయడం గొప్ప అనుభవం.
ప్రభాస్‌తో తీయబోయే పాన్‌ ఇండియా సినిమా ఎలా ఉండబోతుంది?
ప్రభాస్‌ సినిమా త్వరగా సెట్స్‌పైకి వెళ్తుందకున్నా. ఇంత గ్యాప్‌ వస్తుందనుకోలేదు (నవ్వుతూ). ఆ సినిమా కథాంశంతో పాటు సెటప్‌ అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఆ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉంది. ‘మహానటి’ సినిమాలో అప్పటి తరం కార్లు కావాలంటే ఎక్కడో ఓ చోట అద్దెకు దొరికాయి. కానీ ప్రభాస్‌ సినిమా అలా కాదు. మేమే కొత్తగా తయారుచేసుకోవాలి. ఓవరాల్‌గా ప్రభాస్‌ సినిమాను ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్నాం.
భవిష్యత్తులో నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయబోతున్నారా?
నిర్మాతగా ఇదే నా చివరి సినిమా అనుకుంటున్నా. నిర్మాతగా వ్యవహరించడమంటే దర్శకత్వం చేసినంత ఎఫర్ట్స్‌ పెట్టాలి కాబట్టి డైరెక్షన్‌ వైపే దృష్టిపెడతా. ఏమైనా మంచి సబ్జెక్ట్స్‌ వస్తే స్వప్న సినిమా సంస్థకు రెఫర్‌ చేస్తాను.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభాస్‌ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి!

ట్రెండింగ్‌

Advertisement