అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నాయకుడిగా గు ర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్‌రెడ్డి అస్తమించారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అలంకరించి మహానేతగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన మృతితో నడిగడ్డతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఏపీ, కర్ణాటకలోని పలు జిల్లాల ప్రజలు శోక సంద్రంలో మునిగారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం హైదరాబాద్‌లోని దవాఖానలో చేరాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ యశోద దవాఖానలో బుధవారం కన్నుమూశారు. గురువారం తిరుమల్‌రెడ్డి భౌతికకాయం ఉత్తనూర్కు చేరుకోనున్నది. అయిజలో అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. కాగా, తిరుమల్‌రెడ్డి అవయవాలను జీవన్‌ధాన్ ట్రస్టుకు దానం చేశారు.
తిరుమల్‌రెడ్డి మృతితో టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. భౌతికకాయాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుమల్‌రెడ్డి వంటి నేత పార్టీకి దొరకడని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ప్రజల పక్షపాతిగా సేవలందించిన ఘనత తిరుమల్రెడ్డిదేనని ఎంపీ రాములు తెలిపారు. టీఆర్ఎస్ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపు కోసం ఆయన చేసిన ప్రణాళికలు చెప్పుకోదగ్గవన్నారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని కోరారు.
మే 28, 1964లో జన్మించిన తిరుమల్‌రెడ్డి 20 ఏండ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1985 నుంచి 1988 వరకు విండో చైర్మన్‌గా, 1995-2000 వరకు అయిజ ఎంపీపీగా, 2001-06 వరకు జెడ్పీటీసీగా సేవలందించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జెడ్పీ ప్రణాళికా సంఘం సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో ఎంపీపీగా గెలుపొందారు.
వనపర్తి/గద్వాల, మార్చి 23 : తిరుమల్‌రెడ్డి హఠాన్మరణంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో సంతాపం తెలిపారు. నడిగడ్డ ప్రాంతం ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. తిరుమల్‌రెడ్డి బ్రెయిన్‌డెడ్ కావడం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సొంత అన్నను కోల్పోయినంత బాధగా ఉందన్నారు. 20 ఏండ్లు ఇద్దరం కలిసి రాజకీయాల్లో పని చేశామన్నారు. నడిగడ్డలో రాజకీయ విలువలు కలిగిన నేత తిరుమల్‌రెడ్డి అని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు.