Mark Shankar | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్, సింగపూర్‌లోని ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొందిన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన మృతులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన కుమారుడు మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించామని, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకువచ్చామని చెప్పారు. అయితే, మార్క్ సురక్షితంగా ఇంటికి చేరినప్పటికీ, ఆ ప్రమాదం తాలూకు భయం ఇంకా అతడిని వెంటాడుతోందని, రాత్రిళ్లు నిద్రలో భయపడుతూ లేస్తున్నాడని పవన్ తెలిపారు. మార్క్‌కి బిల్డిండ్ నుంచి కింద పడినట్లు కళలు వస్తున్నాయని చెబుతున్నాడని.. ఈ భయాన్ని తగ్గించడానికి ప్రస్తుతం సైకియాట్రిస్ట్ చికిత్స అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.