అజయ్‌ఘోష్, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. ఫ్లైహై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయిరాజేష్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే దర్శకుడు ఎంతో మనసుపెట్టి ఇష్టంతో ఈ సినిమాను తీశాడని అర్థమవుతున్నదని, అజయ్‌ఘోష్ తన పాత్రలో జీవించారని అన్నారు. అజయ్‌ఘోష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. హిందీలో వచ్చిన 12th ఫెయిల్, లాపతా లేడీస్ తరహాలోనే ‘మ్యూజిక్ షాప్మూర్తి’ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే చిత్రమవుతుందని, తెరపై ఓ జీవితాన్ని చూసిన అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.