బేగంపేట్ ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మృత్యుంజయ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10:15 నిమిషాలకు శ్రీ విద్యా శంకర భారతి మహాస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆలయంలో ఆయుష్షు హోమం నిర్వహించి కోటి కుంకుమార్చన, ముగింపు పూజల సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. లోక కల్యాణార్థం 44 రోజల దీక్షగా పూర్వక కృష్ణ యజుర్వేద పారాయణం నిర్వహించారు. అలాగే, గంగాధర కేదార నాథ శర్మ ఘనపాటి శ్రీ రాజరాజేశ్వర సాంగ వేద విద్యాలయం వారి సంపూర్ణ సహకారాలతో 10 మంది వేద పండితులతో అఖండ వేద పారాయణ యజ్ఞం చేశారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ కోషికే కిరణ్మయి కిశోర్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.