ముంబై, ఫిబ్రవరి 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నిందని, ఇందులో భాగంగా అధికార మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) కూటమి నేతలు, వారి కుటుంబసభ్యులు టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో పాటు పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలను కూడా పడగొట్టాలని బీజేపీ చూస్తున్నదని అన్నారు. ముంబైలోని సేనా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం రౌత్ మాట్లాడుతూ కేంద్రం ఒత్తిడి వ్యూహాలకు లొంగేది లేదని తేల్చిచెప్పారు.
తన సన్నిహితులపై ఈడీ దాడుల అనంతరం తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి ‘నామీద శత్రుత్వం ఉంటే.. నన్ను లక్ష్యంగా చేసుకొని టార్చర్ చేసుకోండి!. అంతే తప్ప నా స్నేహితులు, బంధువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’ అని ప్రశ్నించానని చెప్పారు. ఈడీని దేశం కోసం ఏర్పాటు చేశారే తప్ప, రాజకీయ పార్టీ కోసం కాదని స్పష్టం చేశారు. ఎంవీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉద్ధవ్ సర్కార్‌ను కూల్చాలని 20 రోజుల క్రితం పలువురు బీజేపీ అగ్రనేతలు పలుమార్లు తనను కలిసి ఒత్తిడి చేశారని రౌత్ తెలిపారు.