బాలీవుడ్ నటి మౌనీ రాయ్ సినిమాల కంటే తన వ్యక్తిగత విషయాలతోనే ఎకువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన భర్త సూరజ్ నంబియార్ నుంచి విడిపోతున్నట్లు ఇటీవల నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మౌనీ రాయ్ అధికారికంగా ప్రకటించింది. తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తమ వ్యక్తిగత జీవితంపై ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని మౌనీ రాయ్-సూరజ్ నంబియార్ ప్రకటించారు. ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరిన ఈ జంట.. భవిష్యత్తులో మంచి స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడించారు. ‘మీడియాలోని కొందరు మా వ్యక్తిగత జీవితాల్లోకి అతిగా చొరబడటాన్ని మేము గమనిస్తున్నాం. విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాలను గోప్యంగా, స్నేహపూర్వకంగా పరిషరించుకోవడానికి అవసరమైన సమయం తీసుకుంటున్నాం. మా సంబంధం గురించి కల్పిత కథనాలు ప్రచారం చేసి మా వ్యక్తిగత జీవితాన్ని సంచలనాత్మకం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
మారుతున్న వ్యక్తిగత ప్రాధాన్యతలపై లోతుగా ఆలోచించిన తర్వాత, మేము పరస్పరం గౌరవంతో, అవగాహనతో వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతానికి, మేము ఈ దశను ఆలోచనాత్మకంగా, గోప్యంగా అధిగమించడంపై దృష్టి సారించాం’ అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తమ స్నేహాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నిస్తామని పేరొన్నారు. కాగా.. బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్‌కి 2019లో పరిచయం ఏర్పడింది. మూడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత, 2022 జనవరిలో వీరు వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లకే విడిపోతున్నట్లు ప్రకటించి.. అందరికీ షాక్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడంతో విడాకుల ప్రచారం ఊపందుకుంది. నాగిని వంటి డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మౌనీ రాయ్. కేజీఎఫ్ చాప్టర్-1 సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసింది. రణ్‌బీర్ కపూర్, అకినేని నాగార్జున కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో నెగెటివ్ క్యారెక్టర్లో అలరించింది. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తోంది.