హైదరాబాద్/ మహబూబ్‌నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తి వీ శాంతమ్మ (73) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో శాంతమ్మ గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శాంతమ్మ మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు, బంధుమిత్రుల సందర్శనార్థం శాంతమ్మ మృతదేహాన్ని శనివారం ఉదయం మహబూబ్‌నగర్‌లోని మంత్రి స్వగృహానికి తరలించారు. ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ అనారోగ్యంతో మృతిచెందగా.. నెలల వ్యవధిలోనే తల్లి చనిపోవడం కుటుంబంలో విషాదం నింపింది. మంత్రి నిరంజన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో శాంతమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం వీ భూపాల్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ లు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పీ రాములు, టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శాంతమ్మ మృతి పట్ల విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాంతమ్మ ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌నాయక్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు బబ్బూరి భిక్షపతిగౌడ్, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ తదితరులు శాంతమ్మ మృతికి సంతాపం ప్రకటించారు.