న్యూఢిల్లీ, మే 12 : ఈ ఏడాదికిగాను భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాకు ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ కోత పెట్టింది. 0.8 శాతం పడిపోయి 6 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం అంచనా వేసింది. అధిక ఇంధన ధరల నేపథ్యంలో మందగించిన వినిమయం, పెట్టుబడులు, పారిశ్రామిక కార్యకలాపాలు.. జీడీపీ వృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఈ నెలకుగాను విడుదల చేసిన ప్రపంచ స్థూల ఆర్థిక ముఖచిత్రం అప్డేట్లో పేర్కొన్నది.
‘అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు కారణమవుతున్నది. ఈ క్రమంలోనే భారత జీడీపీ ఈ ఏడాది 0.8 శాతం క్షీణించవచ్చు’ అని మూడీస్ తెలిపింది. వచ్చే ఏడాదికిగాను అర శాతం తగ్గి 6 శాతంగానే దేశ జీడీపీ నమోదు కావచ్చన్నది. అయితే మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చక్కబడితే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చన్నది.