Mood of Telangana | ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై అసంతృప్తి.. హామీల అమలులో విఫలంపై ఆగ్రహం.. రాజకీయ విధానాలపై పెదవి విరుపు.. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత.. కేసీఆర్ నివాసంపై దాడి యత్నంపై ఆగ్రహం.. ఇదీ ‘మూడ్ ఆఫ్ తెలంగాణ’ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన ప్రజల మూడ్. అయితే.. రాష్ట్రస్థాయిలో వెల్లడైన ఈ అభిప్రాయాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమా? లేక తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉందా? అన్న ప్రశ్నలకు ఇప్పుడు నియోజకవర్గాల వారీగా వచ్చిన తాజా రిపోర్టు సమాధానం చెప్తున్నది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజల నాడి ఒకే రకంగా కనిపించింది. అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట్లనూ, హైదరాబాద్‌లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తమైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా రిపోర్టులో 118 నియోజకవర్గాల్లో శాంపిళ్లు నమోదయ్యాయి. మొత్తం 29,476 మంది అభిప్రాయాలను సేకరించారు. ఇందులో ఐదు ప్రశ్నలపై ప్రజల స్పందనను నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన తీరు ఎలా ఉంది? ఎన్నికల హామీలు అమలు చేశారా? ముఖ్యమంత్రి అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై అభిప్రాయం ఏమిటి? కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మరణాన్ని కోరుకోవడంపై ప్రజల స్పందన ఏమిటి? కేసీఆర్-బీఆర్ఎస్ పాలన, రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ పాలనలో ఏది బాగుంది? కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ చేసిన దాడి యత్నంపై ఏమంటున్నారు? అనే ఐదు అంశాలపై నియోజకవర్గాల వారీగా ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు.
ఇప్పటికే వెల్లడైన రాష్ట్రస్థాయి ఫలితాల్లో రేవంత్ పాలన బాగోలేదని, హామీలు అమలు కాలేదని 74.64 శాతం మంది పేర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 19.06 శాతం మంది మాత్రమే పాలన బాగుందని, హామీలు అమలు చేశారని చెప్పారు. సీఎం రాజకీయ విధానాలు సరిగా లేవని 71.33 శాతం మంది పేర్కొనగా.. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మరణాన్ని కోరుకోవడం సరైన పద్ధతి కాదని ఏకంగా 92.87 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక గత కేసీఆర్-బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ పాలనలో ఏది బాగుందని అడిగితే 72.82 శాతం మంది కేసీఆర్ పాలనకే జై కొట్టారు. రేవంత్ పాలన బాగుందని 16.62 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. కేసీఆర్ నివాసంపై దాడి యత్నాన్ని 84.21 శాతం మంది వ్యతిరేకించారు.
ఇప్పుడు నియోజకవర్గాల వారీగా వచ్చిన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రస్థాయిలో కనిపించిన ఇదే ధోరణి కేవలం కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కాలేదని స్పష్టమవుతున్నది.
‘సీఎం రేవంత్‌రెడ్డి పాలన తీరు ఎలా ఉంది? ఎన్నికల హామీలు అమలు చేశారా?’ అన్న మొదటి ప్రశ్నకు నియోజకవర్గాల వారీగా వచ్చిన సమాధానాలు కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 118 నియోజకవర్గాల్లో అన్నిచోట్లా ‘పాలన బాగోలేదు.. హామీలు అమలు కాలేదు’ అన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంది. అత్యధికంగా నాంపల్లి, చార్మినార్‌లో ఏకంగా 100 శాతం మంది రేవంత్ పాలన బాగోలేదని, హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. జుక్కల్‌లో 94.5 శాతం, బాల్కొండలో 93 శాతం, పటాన్చెరులో 91.6 శాతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 91.1 శాతం, మహబూబ్‌నగర్‌లో 90.6 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే.. ఏడు నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ప్రజలు రేవంత్ పాలనపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసినట్టయింది.
ఇదే ప్రశ్నలో 80 శాతానికి పైగా వ్యతిరేకత నమోదైన నియోజకవర్గాలు 32 ఉన్నాయి. 70 శాతానికి పైగా ప్రజలు పాలన బాగోలేదని చెప్పిన నియోజకవర్గాల సంఖ్య ఏకంగా 83 ఉన్నాయి. అదిలాబాద్‌లో 87.3 శాతం, గజ్వేల్‌లో 86.8 శాతం, కామారెడ్డిలో 86 శాతం, నాగార్జునసాగర్‌లో 86 శాతం, తాండూరులో 85.1 శాతం, నిజామాబాద్ అర్బన్‌లో 84.3 శాతం, అశ్వారావుపేటలో 84.2 శాతం మంది రేవంత్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో 83.7 శాతం, దేవరకద్రలో 83.3 శాతం, జగిత్యాలలో 82.8 శాతం, నర్సంపేటలో 82.7 శాతం, కుత్బుల్లాపూర్‌లో 82.5 శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
సీఎం సొంత ఇలాకాలోనూ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ ప్రజల స్పందన కాంగ్రెస్‌కు అనుకూలంగా లేదు. అక్కడ 76 శాతం మంది రేవంత్ పాలన బాగోలేదని పేర్కొన్నారు. రేవంత్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు సరిగా లేవని 68.2 శాతం మంది చెప్పగా.. ప్రస్తుత పాలన కంటే గత కేసీఆర్ పాలనే బాగుందని 64.2 శాతం మంది పేర్కొన్నారు. కేసీఆర్ నివాసంపై దాడి యత్నాన్ని 84.4 శాతం మంది వ్యతిరేకించగా.. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మరణాన్ని కోరుకోవడం సరైన పద్ధతి కాదని ఏకంగా 95 శాతం మంది కొడంగల్ ప్రజలు అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మీ అభిప్రాయం ఏమిటి?’ అన్న రెండో ప్రశ్నకూ దాదాపు ఇదే ఫలితం వచ్చింది. రాష్ట్రస్థాయిలో 71.33 శాతం మంది రేవంత్ రాజకీయ విధానాలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే 118 నియోజకవర్గాల్లోనూ రేవంత్ రెడ్డి రాజకీయ విధానాలు ‘కరెక్ట్ కాదు’ అన్న అభిప్రాయమే ఎక్కువగా నమోదైంది. నాంపల్లి, చార్మినార్‌లో 100 శాతం మంది రాజకీయ విధానాలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు. బహదూర్‌పురాలో 98.4 శాతం, జుక్కల్‌లో 89 శాతం, గజ్వేల్‌లో 88.7 శాతం, సిద్ధిపేటలో 88.5 శాతం, మల్కాజిగిరిలో 87.7 శాతం మంది రేవంత్ రాజకీయ విధానాలను తప్పుబట్టారు. నిజామాబాద్ అర్బన్‌లో 86.4 శాతం, సత్తుపల్లిలో 86 శాతం, కామారెడ్డిలో 85.6 శాతం, ఆదిలాబాద్‌లో 85.2 శాతం, నాగార్జునసాగర్‌లో 84.7 శాతం, బాల్కొండలో 84.5 శాతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 84.4 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉమ్మడి ఖమ్మం ప్రాంతాల్లోనూ రేవంత్ రాజకీయ విధానాలపై ప్రతికూల స్పందన గణనీయంగా కనిపించింది.
‘కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ మరణాన్ని కోరుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అన్న మూడో ప్రశ్నకు వచ్చిన అభిప్రాయాలు దాదాపు ఏకపక్షంగా ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే 92.87 శాతం మంది ఇది సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. 118 నియోజకవర్గాల్లోనూ ‘కేసీఆర్ మరణాన్ని కోరుకోవడం సరైన పద్ధతి కాదు’ అన్న అభిప్రాయమే అత్యధికంగా నమోదైంది. అంతేకాదు.. 110 చోట్ల 70 శాతానికి పైగా ప్రజలు కాంగ్రెస్ నేతల తీరును తప్పుబట్టారు. ఏకంగా 88 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్, నాంపల్లి, చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, మహబూబ్‌నగర్‌లో 100 శాతం మంది ఈ విధానాన్ని వ్యతిరేకించారు. పటాన్చెరులో 99.6 శాతం, సత్తుపల్లిలో 99.4 శాతం, వరంగల్ ఈస్ట్‌లో 99.2 శాతం, మల్కాజిగిరిలో 99.1 శాతం, కొల్లాపూర్‌లో 99.1 శాతం మంది కాంగ్రెస్ నేతల తీరాన్ని తప్పుబట్టారు. కామారెడ్డిలో 98.7 శాతం, జుక్కల్‌లో 98.3 శాతం, ముషీరాబాద్‌లో 98 శాతం, పాలకుర్తిలో 98 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు, ఆరోపణలు చేయడం వేరు.. ఆయన మరణాన్ని కోరుకోవడం వేరు అన్న భావన ప్రజల్లో బలంగా ఉందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
‘కేసీఆర్-బీఆర్ఎస్ పాలన బాగుందా? రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ పాలన బాగుందా?’ అని ప్రజలను నేరుగా అడిగితే..118 నియోజకవర్గాల్లోనూ కేసీఆర్-బీఆర్ఎస్ పాలనకు వచ్చిన శాతం రేవంత్-కాంగ్రెస్ పాలన కంటే ఎక్కువగా ఉంది. అంటే.. ఒక్క నియోజకవర్గంలో కూడా రేవంత్ పాలనకు కేసీఆర్ పాలనపై ఆధిక్యం కనిపించలేదు.
నాంపల్లి, చార్మినార్‌లో 100 శాతం మంది కేసీఆర్ పాలనే బాగుందని పేర్కొన్నారు. జుక్కల్‌లో 95.3 శాతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 93.3 శాతం, అశ్వారావుపేటలో 89.5 శాతం, పటాన్చెరులో 88.8 శాతం, జూబ్లీహిల్స్‌లో 88.7 శాతం, ఆదిలాబాద్‌లో 88.6 శాతం మంది కేసీఆర్ పాలనకు మద్దతు పలికారు. గజ్వేల్‌లో 87.9 శాతం, బాల్కొండలో 87.5 శాతం, సత్తుపల్లిలో 86.6 శాతం, మిర్యాలగూడలో 86.2 శాతం, ఎల్లారెడ్డిలో 85.6 శాతం, కామారెడ్డిలో 85.5 శాతం మంది గత బీఆర్ఎస్ పాలనే బాగుందని చెప్పారు. బాన్సువాడ, ఆలేరు నియోజకవర్గాల్లో 83.4 శాతం, బహదూర్‌పురాలో 82.8 శాతం, నాగార్జునసాగర్‌లో 82.7 శాతం, సిద్ధిపేటలో 82.4 శాతం, ఆసిఫాబాద్‌లో 80.8 శాతం, కొల్లాపూర్‌లో 80.5 శాతం, భూపాలపల్లిలో 80.4 శాతం మంది కేసీఆర్ పాలనకు మద్దతు పలికారు.
‘కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ చేసిన దాడి యత్నం మీద మీరేమంటారు?’ అని ప్రశ్నించగా.. రాష్ట్రస్థాయిలో 84.21 శాతం మంది వ్యతిరేకించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే 118 నియోజకవర్గాల్లోనూ దాడి యత్నాన్ని వ్యతిరేకించినవారే ఎక్కువగా ఉన్నారు. నాంపల్లిలో 100 శాతం, సత్తుపల్లిలో 99.4 శాతం, పటాన్చెరులో 98.4 శాతం, చార్మినార్‌లో 98.4 శాతం, బహదూర్‌పురాలో 98.4 శాతం మంది దాడి యత్నాన్ని వ్యతిరేకించారు.
కామారెడ్డి, కుత్బుల్లాపూర్‌లో 97.9 శాతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 97.8 శాతం, మల్కాజిగిరిలో 97.2 శాతం, నిజామాబాద్ అర్బన్‌లో 96.4 శాతం మంది వ్యతిరేకించారు. మిర్యాలగూడలో 95.7 శాతం, ఎల్లారెడ్డిలో 94.8 శాతం, మహబూబ్‌నగర్‌లో 94.8 శాతం, పాలకుర్తిలో 94.7 శాతం, కొల్లాపూర్‌లో 94.4 శాతం మంది ఈ దాడి యత్నాన్ని తప్పుబట్టారు. మొత్తంగా 110 నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా ప్రజలు దాడి యత్నాన్ని వ్యతిరేకించారు. 34 నియోజకవర్గాల్లో ఈ వ్యతిరేకత 90 శాతాన్ని దాటింది.
నియోజకవర్గాల వారీగా గణాంకాలను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఆదిలాబాద్‌లో రేవంత్ పాలన బాగోలేదని 87.3 శాతం మంది చెప్పగా.. కేసీఆర్ పాలనకు 88.6 శాతం మంది మద్దతు పలికారు. జుక్కల్‌లో రేవంత్ పాలనపై 94.5 శాతం అసంతృప్తి ఉండగా.. కేసీఆర్ పాలనకు 95.3 శాతం మద్దతు నమోదైంది.
బాల్కొండలో 93 శాతం మంది రేవంత్ పాలనను తప్పుబట్టారు. అక్కడ కేసీఆర్ పాలనకు 87.5 శాతం మద్దతు వచ్చింది. కామారెడ్డిలో 86 శాతం మంది రేవంత్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. 85.5 శాతం మంది కేసీఆర్ పాలనే బాగుందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్‌లో 84.3 శాతం మంది రేవంత్ పాలనను తప్పుబట్టారు. కేసీఆర్ పాలనకు 77 శాతానికి పైగా మద్దతు నమోదైంది.
హైదరాబాద్ నియోజకవర్గాల్లోనూ సర్వే ఫలితాలు కాంగ్రెస్‌కు పెద్దగా ఊరటనివ్వలేదు. నాంపల్లి, చార్మినార్‌లో రేవంత్ పాలన బాగోలేదని 100 శాతం మంది పేర్కొనడం అత్యంత తీవ్రమైన ఫలితం. అదే రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పాలనకు 100 శాతం మద్దతు నమోదైంది. బహదూర్‌పురాలో 89.1 శాతం మంది రేవంత్ పాలనను వ్యతిరేకించగా.. కేసీఆర్ పాలనకు 82.8 శాతం మద్దతు వచ్చింది. కుత్బుల్లాపూర్‌లో 82.5 శాతం మంది రేవంత్ పాలనను తప్పుబట్టారు. కేసీఆర్ పాలనకు అక్కడ కూడా గణనీయమైన మద్దతు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో కేసీఆర్ పాలనకు 88.7 శాతం మద్దతు రావడం కూడా గమనార్హం. పటాన్చెరులో రేవంత్ పాలనపై 91.6 శాతం వ్యతిరేకత ఉండగా.. కేసీఆర్ పాలనకు 88.8 శాతం మద్దతు వచ్చింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. నియోజకవర్గాల వారీ సర్వేలో రేవంత్ ప్రభుత్వానికి అనుకూలమైన ఏకపక్ష మూడ్ కనిపించలేదు. ఖమ్మంలో రేవంత్ పాలన బాగోలేదని 82.3 శాతం మంది పేర్కొన్నారు. కేసీఆర్ పాలనకు 70.8 శాతం మంది మద్దతు పలికారు. సత్తుపల్లిలో 82.3 శాతం మంది రేవంత్ పాలనను తప్పుబట్టగా.. 86.6 శాతం మంది కేసీఆర్ పాలనకు మద్దతిచ్చారు. అశ్వారావుపేటలో 84.2 శాతం మంది రేవంత్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేసీఆర్ పాలనకు ఏకంగా 89.5 శాతం మద్దతు వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిరలో రేవంత్ పాలన బాగోలేదని 74.1 శాతం మంది చెప్పగా.. కేసీఆర్ పాలనకు 70.9 శాతం మంది మద్దతు పలికారు. పాలేరులో మాత్రం రెండు అభిప్రాయాల మధ్య వ్యత్యాసం తక్కువగా కనిపించినప్పటికీ.. అక్కడ కూడా కేసీఆర్ పాలనే ముందుంది. కేసీఆర్‌కు 53.9 శాతం, రేవంత్‌కు 41.1 శాతం మద్దతు నమోదైంది.