బచ్చన్నపేట డిసెంబర్ 29 : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ హేయమైన చర్య అని చిన్నరాంచర్ల గ్రామ సర్పంచ్ మహ్మద్ ఆజాం విమర్శించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలువురు మాజీ సర్పంచులను పోలీసులు సోమవారం ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ఐదేళ్లు డబ్బులు పెట్టి పని చేసిన తమను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ చర్యను చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల మాజీ సర్పంచుల పదవీకాలం పూర్తయి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని అన్నారు. న్యాయబద్ధంగా తమకు రావలసిన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక మంది సర్పంచులు అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు ముసిని రాజు గౌడ్, కోనేటి స్వామి, తాతిరెడ్డి శశిధర్ రెడ్డి, పర్వతం మధు ప్రసాద్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.