హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మోదీ కాదు.. నక్కజిత్తుల మోసకారి అని రుజువైందన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ దళితుల కోసం రూ.20 వేల కోట్లకుపైగా ఖర్చుచేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వార్షిక బడ్జెట్లో దళిత గిరిజనుల కోసం పెట్టింది రూ.12 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రైతులు, దళితులకు ఏం చేయలేదనే ఆవేదనతోనే సీఎం కేసీఆర్ మాట్లాడారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలప్పుడు జై భీమ్ అంటాయని, బడ్జెట్లో మాత్రం నై భీమ్ అంటున్నాయని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్‌లు గల్లీలో కొట్లాడుతారు, ఢిల్లీలో కలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని 105 సార్లు మార్చుకున్నపుడు కొత్త రాజ్యాంగం తెస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కొత్త రాజ్యాంగం తెస్తే అంబెద్కర్ పేరుకు ఎలాంటి విఘాతం జరిగిందని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ పథకాలు ప్రజల కోసం ఉంటాయని, దళితులకు లబ్ధి చేకూర్చాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. రాజ్యాంగమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలిపారు. పాలకులకు చట్టబద్ధమైన విజన్ ఉండేందుకే సీఎం కేసీఆర్ కొత్త రాజ్యాంగం ప్రతిపాదన తెచ్చారన్నారు. గాడ్సేకి సెల్యూట్ కొట్టే బీజేపీ.. టీఆర్ఎస్ను అంబేద్కర్‌కు వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.