జడ్చర్ల, మే 20 : నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 16,17 వార్డుల్లో డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధ్దిదారుల ఎంపిక కోసం ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధ్దిదారులు ఏం పనులు చేస్తున్నారు.. వారి ఆర్థిక పరిస్థితి గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో వెయ్యి డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని అర్హులకు అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఎంపిక చేసి రూ.3లక్షల స్కీం వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని సర్వే నిర్వహించారని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో తానే స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ అర్హులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా.. ఒక్క రూపాయి తీసుకోకుండా లబ్ధ్దిదారులకు ఇండ్లు ఇస్తామన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే డబ్బులు ఇచ్చిన వారికి ఇండ్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2వేల ఇండ్లు నిర్మిస్తున్నామని, జూన్ మొదటి వారంలో ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. వర్షాలు వచ్చిన సమయంలో ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని, డ్రైనేజీలను వెడల్పు చేయాలని, సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే పెద్ద డ్రైనేజీని వెడల్పు చేసి సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్‌చైర్మన్ మహ్మద్‌అలీ, దానిశ్, కౌన్సిలర్లు లలితానాగరాజు, చైతన్య, ప్రశాంత్‌రెడ్డి, తాసీల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ మహెమూద్షేక్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖానను ఈ నెల 27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దవాఖానను పరిశీలించారు. రూ.30కోట్లతో నిర్మించిన దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. దవాఖాన ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.