కొండాపూర్, డిసెంబర్ 21 : రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా రూ. 7.50లక్షలతో జలమండలి విభాగం ఏర్పాటు చేసిన తాగునీటి ఆన్లైన్ బూస్టర్‌ని డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన స్వల్పకాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు తొలగిపోయాయన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటికి తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా చేపట్టిన లక్ష్యం దాదాపు పూర్తైనట్లు తెలిపారు. ఎంతైన కాలనీలకు పంపింగ్ సమస్యలు తొలగించేందుకు ఆన్లైన్ బూస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా జలమండలి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, నాయకులు రాజు యాదవ్, ఊట్ల కృష్ణ, శశిధర్‌రెడ్డి, రమేశ్, జంగంగౌడ్, నరసింహసాగర్, నరేశ్ ముదిరాజ్, రవిగౌడ్, రమేశ్, రాజేశ్ యాదవ్, తిరుపతిరెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.