జెరూసలేం, మే 4: పాలస్తీనియన్లకు మద్దతుగా క్షిపణి దాడులు జరుపుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్.. ఇజ్రాయెల్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఆదివారం హౌతీ రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద విమానాశ్రయాన్ని తాకింది. భారీ శబ్ధం చేస్తూ.. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3కి 75 మీటర్ల దూరంలో పడింది. బాంబు పేలుడు ధాటికి క్షిపణి పడ్డ చోట 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఒకటి ఏర్పడింది. దీంతో విమానాశ్రయంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొంతమంది ప్రయాణికులు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. క్షిపణి దాడిలో 8 మంది గాయపడినట్టు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. దాడి అనంతరం టెల్ అవీవ్‌కు విమాన రాకపోకల్ని పాక్షికంగా నిలిపివేశారు. ఇజ్రాయెల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన బెన్ గురియన్ విమానాశ్రయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేయటం సంచలనంగా మారింది. శక్తివంతమైన నాలుగు అంచెల రక్షణ వ్యవస్థను దాటుకొని క్షిపణి లోపలికి రావటం ఐడీఎఫ్ బలగాలను విస్మయానికి గురిచేసింది. విమానాశ్రయం సమీపంలో క్షిపణి పడకుండా అడ్డగించేందుకు చేసిన పయత్నాలు విఫలమయ్యాయని ‘ఐడీఎఫ్’ తెలిపింది. కాగా, హౌతీ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పందిస్తూ, ‘హౌతీ రెబల్స్ లక్ష్యంగా ఒక్క దాడితో సరిపెట్టం. ముందు ముందు శత్రువుపై అనేక దాడులు ఉంటాయి’ అని హెచ్చరించారు.
ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లింపు
టెలీ అవీవ్ విమానాశ్రయంపై క్షిపణి దాడి నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ‘ఏఐ 139’ ఫ్లైట్‌ను అబుదాబికి దారి మళ్లించామని, ఫ్లైట్‌ను తిరిగి ఢిల్లీకి తీసుకొస్తామని ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. అంతేగాక, ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసుల్ని మే 6 వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం టెల్ అవీవ్‌లో ల్యాండ్ కావడానికి ఒక గంటముందు క్షిపణి దాడి జరగటం సర్వత్రా ఆందోళన రేకెత్తించింది.