
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 18: బీజేపీ నేత కుటుంబానికి ఎల్వోసీ అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ నాయకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మూడావత్ బోజ్యానాయక్-లక్ష్మి దంపతుల రెండో కూతురు మెర్సీ 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్లో పరీక్షలు చేయించగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నదని వైద్యులు నిర్ధారించారు. ఆ యువతిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ రెండు రోజులకే వైద్య ఖర్చులకు రూ.లక్ష ఖర్చయింది. మరిన్ని డబ్బులు అవసరం ఉండటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బోజ్యానాయక్ విషయాన్ని స్థానిక సర్పంచ్ శంకర్‌నాయక్, సతీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తక్షణం స్పందించి మెర్సీని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించి ఆమె వైద్యానికి రూ.2 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ పత్రాన్ని టీఆర్ఎస్ నాయకులు.. మెర్సీకి అందజేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులు బోజ్యానాయక్-లక్ష్మి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.