నిర్మల్, ఆగస్ట్ 29 : క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ నేటి క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి అంబేద్కర్ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం అధికంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా కారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అప్పుడే ఒలింపిక్స్లాంటి అత్యున్నత పోటీలలో భారతదేశ క్రీడాకారులు రాణించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు క్రీడా మైదానాలను వినియోగించుకుని ఆయా క్రీడల్లో ప్రతిభ పెంచుకోవాలన్నారు.