నిర్మల్ అర్బన్, జనవరి 17: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సోమవారం కనుమ పండుగ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి-విజయలక్ష్మి దంపతులు 108 మంది బ్రాహ్మణ దంపతులకు పాదపూజ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్చిలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. బాసర జ్ఞానసరస్వతి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వర ముక్తేశ్వరస్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తుచేశారు.