మనం పుట్టిన ఊరు, మనకు చదువులు చెప్పి ప్రయోజకులు చేసిన బడి ఈ రెండూ కూడా కన్న తల్లిదండ్రులతో సమానమని, అవి మనకు ఏమి ఇచ్చాయనేది కాక, మనం తిరిగి ఏమిచ్చామనేదే ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ విషయం బాగా తెలిసిన వారిగా డాక్టర్ హనుమాన రాజేందర్ రెడ్డి తన ఊరికి, చదువు చెప్పిన బడికి ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం స్థలాలు ఇచ్చారని అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం ఇచ్చారని, గ్రామానికి చెందిన పాఠశాలకు సైన్స్ ల్యాబ్ వంటి అనేక సదుపాయాలు కల్పించాడం కోసం లక్షలాది రూపాయలు వ్యయం చేస్తూ ఊరికి, బడికి ఉపకార సేవలు చేస్తున్న రాజేందర్ రెడ్డి ఎంతో ఆదర్శనీయులని మంత్రి అభినందించారు.
మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన హనుమండ్ల లక్ష్మమ్మ జ్ఞాపకార్థ నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. డాక్టర్ రాజేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఎన్నారైలు వారి వారి గ్రామాలకు సేవలు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.