సికింద్రాబాద్, డిసెంబర్ 24 : ఆత్మనిర్భర్ భారత్ కల సాకారంలో మిలిటరీ పాత్ర అత్యంత కీలకమని భారత్ ఫోర్జ్ లిమిటెడ్ సీఎండీ బీఎన్ కల్యాణి అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీ ఎంసీఈఎంఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్) వందో స్నాతకోత్సవం శుక్రవారం సికింద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కల్యాణి 53 మంది యువ మిలిటరీ అధికారులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తమ కంపెనీకి, భారత మిలిటరీకి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎంసీఈఎంఈ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ మాట్లాడుతూ, నూతన సాంకేతిక అంశాలపై యువ అధికారులు పట్టు సాధిస్తూ ఉండాలని సూచించారు. కెప్టెన్ అమోఘ శర్మకు డీజీఈఎంఈ ట్రోఫీ, జీవోసీ-ఇన్-సీ ఆర్ట్రాక్ బుక్న్రైజ్తో పాటు కమాండెంట్స్ వెండి పతకాన్ని, లెఫ్టినెంట్ కే. సూరజ్‌కు జీవోసీ-ఇన్-సీ ఆర్ట్రాక్ ట్రోఫీ, బుక్ ఫ్రైజ్, కెప్టెన్ ధీరజ్ శర్మ, లెఫ్టినెంట్ అన్వేశ్ కుమార్‌లకు డీజీఈఎంఈ బంగారు, కమాండెంట్స్ వెండి పతకాలు, లెఫ్టినెంట్ ఆర్.రిషబ్ శంకర్‌కు కమాండెంట్స్ వెండి పతకాన్ని అందజేశారు.
హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండింగ్ ఆఫీసర్‌గా మనీష్ సభర్వాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన ప్రత్యేక పరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. మనీష్ సభర్వాల్ ఉత్తమ సేవలకుగాను విశిష్ఠ సేవా మెడల్ పొందారు. 1992లో భారత వాయుసేనలో చేరిన మనీష్ సభర్వాల్‌కు వివిధ రకాల ఎయిర్క్రాప్ట్లను 3,300 గంటలపాటు నడిపిన అనుభవం ఉంది.