ఉట్నూర్ : ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు ఆశలు చూపెట్టి ఉద్యోగాలు ఇస్తామని కోట్ల రూపాయలు దండుకొని పరారైన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ కృష్ణను (Chairman Krishna) వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ( Ritesh Rathod ) డిమాండ్ చేశారు. ఉట్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూరు, జైనూర్లలో డిజిటల్ మైక్రోఫైనాన్స్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని మేనేజర్లు , డైరెక్టర్లు, క్లర్కులు లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన కృష్ణ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అమాయక గిరిజన నిరుద్యోగులను మోసం చేయడానికి వలసవాదులు వస్తున్నారని సేవ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న వారిపట్ల అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలు సైతం మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు ఊరికే వస్తాయని భ్రమ పడవద్దు అన్నారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, మాజీ జడ్పీటీసీ సాదిగే గంగన్న, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, సి పతి లింగాగౌడ్, అడిగే రాజేశ్వర్, శ్రీనివాస్, బానోత్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.