సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నేటి యువత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇందుకవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. శనివారం జేఎన్టీయూ హైదరాబాద్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జేఎన్టీయూ ఏర్పాటై 50 ఏండ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని జాబ్‌మేళాను నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పించడం ఎంతో సంతోషకరమన్నారు.
యువతకు ఉద్యోగ కల్పనలో 145 కంపెనీలు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్, పారిశ్రామిక, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, మెడికల్ రంగాలలో ఐఏ, ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ వంటి నూతన టెక్నాలజీని విస్తృతం చేస్తున్నారని, ఆ మేరకు ఆయా రంగాలలో ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయన్నారు. ఈ రంగాలపై యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు సహకారం అందిస్తున్నదన్నారు. జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాకు ఊహించిన దాని కన్నా ఎక్కువ మంది రావడం ఆనందంగా ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అధిక మానవ వనరులు అదృష్టమన్నారు. యువత నైపుణ్యాలు పెంచుకొని మరొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. మార్చిలో మరో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సుల్తాన్పూర్, మంథని, సిరిసిల్ల, జగిత్యాలలో ఉన్న యూనివర్సిటీ కాలేజీలలో జాబ్‌మేళాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్దన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకురాలు సుభద్ర పాల్గొన్నారు.
50 వేలకు పైగా హాజరు..
జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఊహించని స్పందన లభించింది. కేవలం 10 వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తే దాదాపు 50 వేలకు పైగా యువత మేళాకు హాజరయ్యింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా పరిగి, వికారాబాద్, సిద్ధిపేట వంటి చుట్టు పక్కల జిల్లాల నుంచి యువత పెద్ద సంఖ్యలో జాబ్‌మేళాకు తరలివచ్చారు.