మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బుదాపెస్ట్‌లో జరగాల్సిన మీటింగ్ రద్దు అయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న దశలో పుతిన్‌తో జరిగే సంభాషణ ఫలప్రదం కాదు అని ఆయన అన్నారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా రష్యా స్పందించలేదు. నాటో కార్యదర్శి మార్క్ రుట్‌తో వైట్‌హౌజ్‌లో జరిగిన భేటీ తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హంగేరీలో జరగాల్సిన మీటింగ్ సరైన దశలో లేదన్నారు. అనుకున్న దిశగా ఆ చర్చలు వెళ్లేటట్లు లేవని, అందుకే ఆ సమావేశాన్ని రద్దు చేశామని ట్రంప్ అన్నారు. అయితే భవిష్యత్తులో చర్చలు నిర్వహించేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు ఆయన చెప్పారు.
మరో వైపు రష్యాపై కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, లుకోయిల్ కంపనీలపై ఆంక్షలు పెట్టింది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో రష్యాపై అమెరికా వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. పుతిన్‌తో మాట్లాడిన ప్రతిసారి ఆయన బాగానే మాట్లాడుతున్నారని, సంభాషణలు సంపూర్ణంగా జరిగా, వాటి ఫలితం రావడం లేదని ట్రంప్ అన్నారు. బుధవారం ఉక్రెయిన్‌లోని ఓ పిల్లల స్కూల్‌పై రష్యా అటాక్ చేసిన ఘటనతో అమెరికా ఆందోళనకు గురైంది.