Vikas Swami | మీరట్, ఫిబ్రవరి 17: ఇటలీలోని ప్రముఖ నగరం ‘మిలాన్’లో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో, దంతాలతో 125 కిలోల బరువు ఎత్తి మీరట్‌కు చెందిన వికాస్స్వామి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఫిబ్రవరి 14న మిలాన్‌లో జరిగిన పోటీల్లో స్వామి తన పంటి బలంతో 125 కిలోల బరువును 35.57 సెకండ్లపాటు ఎత్తారు. తద్వారా సరికొత్త ప్రపంచ రికార్డ్ నెలకొల్పినట్టు తాజాగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మిలాన్ పోటీల్లో పాల్గొని ఆదివారం ఇంటికి చేరుకున్న అతడికి స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది.
అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లభించలేదని ఆయన వాపోయారు. అథ్లెట్స్, ఇతర క్రీడాకారులకు లభించినట్టుగా, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించటం లేదని వికాస్ స్వామి అన్నారు. తన విజయాలపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించలేదని, కానీ తన గ్రామస్థులు తనను గౌరవిస్తున్నారని ఆయన అన్నారు. దంతాల బలం కోసం టూత్పేస్ట్లు, ఇతర ఉత్పత్తులు ఏవీ వాడటం లేదని, కఠినమైన యోగా సాధనతో ఇంతటి బలాన్ని సాధించినట్టు వికాస్ స్వామి విలేకర్లకు చెప్పారు.