వాజేడు/అశ్వారావుపేట రూరల్, నవంబర్ 27: వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని వైద్య సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇందుకోసం గుట్టలు ఎక్కి, వాగులు, వంకలు దాటి వెళ్లి గిరిజనులకు కరోనా టీకాలు వేస్తున్నారు. శనివారం వైద్య సిబ్బంది ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం పెనుగోలు గిరిజన గ్రామానికి చేరుకోవడానికి 16 కిలోమీటర్లు నడిచి.. మూడు గుట్టలు ఎక్కి.. మూడు వాగులు దాటాల్సి వచ్చింది. గూడెంవాసులకు వైద్యసేవలందించడంతోపాటు టీకాలు వేశారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదమిద్ది గ్రామానికి వెళ్లిన వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 34 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావడం.. రెండు వాగులు దాటి.. నాలుగు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కూలీలు స్థిరపడ్డారు. ఎంతో ఓపికతో గిరిజన గూడేలకు వెళ్లి వ్యాక్సిన్ వేసిన సిబ్బందిని అధికారులు అభినందించారు.