హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో వైద్యశాఖకు రూ.7,500 కోట్లు ఇస్తే, ఇప్పుడు రూ.5 వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఈ ఏడాది రూ. 11,237 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6,295 కోట్లతో పోలిస్తే 78శాతం ఎక్కువ. గత కొన్నేండ్లలో రాష్ట్రంలోని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అధునాతన దవాఖానలు నిర్మించింది. పాత వాటిని అప్గ్రేడ్ చేసింది. వైద్యశాఖ మంత్రిగా ఈటల కొన్ని దవాఖానల ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీ మారగానే ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.