గద్వాల అర్బన్, జూలై 13: మెడికల్ షాప్ లైసెన్స్ (Medical Shop) కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని మెడికల్ అసోసియోషన్ నిర్మొహమాటంగా చెప్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏ మూలాన అయినా సరే మెడికల్ షాపు పెట్టాలంటే వారికి కప్పం కట్టాలని.. లేనట్లయితే లైసన్స్ జారీ చేసే విషయంలో కాలయాపన చేస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. జాప్యానికి కారణమేంటని మెడికల్ అసోసియేషన్ సభ్యులను ఆరతీయగా పలానా వారికి డబ్బులు ముట్టచెప్పారా, లేనట్లయితే లైసన్స్ ఎలా వస్తుందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొ లైసన్స్ కోసం రూ.30 వేల నుంచి రూ.50 వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తున్నది.
ఔషధ నియంత్రణ కార్యాలయానికి సంబంధించి గతంలో అన్నీ తానై వ్యవహారాలు నడిపిన వ్యక్తే.. ప్రస్తుతం లైసన్స్ జారీ చేసే వ్యవహరంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దరఖస్తుదారుల వివరాలు సేకరించి వారి వద్ద పైసలు వసూలు చేసి లైసన్స్ ఇచ్చేవారికి ముట్టచెప్పడం అతని వృత్తిలా మారిపోయింది. ఇలా జిల్లాలో కొన్ని వందల లైసెన్సులు జారీ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన్నట్లు సమాచారం. అలాగే తనీఖిలు నిర్వహించిన అనంతరం మెడికల్ షాపు నిర్వహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.