స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ సంఘాల్లోని సభ్యులకు లింకేజీ రుణాలను అందజేసి చిన్న, మధ్యతరహా వ్యాపారాలు నిర్వహించుని వారి సొంత కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 10,761 ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.386 కోట్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఫిబ్రవరి నెలాఖరు వరకే రూ.416 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. రుణాలు తీసుకున్నవారు సైతం సకాలంలో రీపేమెంట్ చేస్తుండడంతో రికవరీ రేటు 98 శాతంగా నమోదైంది. గతంలో ఒక్కో సభ్యురాలికి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు మాత్రమే ఇవ్వగా ప్రస్తుతం రూ.లక్ష వరకు రుణం ఇస్తున్నారు. దీంతో చాలా మంది మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని వృద్ధిలోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు.
మెదక్, మార్చి 14: పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలిచ్చి ప్రోత్సహించడంలో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2021-22లో బ్యాంక్ లింకేజీ లక్ష్యం రూ.386.88 కోట్లు కాగా, రూ.416.40 కోట్ల రుణాలిచ్చి టార్గెట్‌ను మించిపోయింది. 2018-19లో రూ.192 కోట్ల లక్ష్యంగా కాగా, రూ.220 కోట్లు, 2019-20లో రూ.200 కోట్లకు, రూ.246 కోట్లు, 2020-21లో రూ.320కోట్లకు, రూ.348 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలిచ్చింది. మెదక్ జిల్లాలో 10,761 గ్రూపులున్నాయి. ఇందులో 8234 గ్రూపులకు బ్యాంక్ లింకేజీ కింద రూ.386.88 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.416.40 కోట్ల రుణాలిచ్చి లక్ష్యాన్ని మించింది.
రూ.416 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు
మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా పురోగతి సాధించడానికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. గ్రామాల్లోని మహిళలను ఇందులో భాగస్వాములు చేయగా ఒక్కో సంఘంలో కనీసం పది మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు. ఈ సంఘాలకు ప్రతి ఏడాది అవసరమైన రుణాలను సెర్ప్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను వారికి ఇష్టం వచ్చిన రంగాన్ని ఎంచుకుని, నైపుణ్యం సాధిస్తున్నారు. ప్రతి నెలా మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు బ్యాంక్ లింకేజీ లక్ష్యం పూర్తి చేయాల్సి ఉండగా, ఫిబ్రవరి నెలాఖరుకే టార్గెట్ మించి బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశారు. బ్యాంక్ లింకేజీలో 107.63 శాతంతో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
రీపేమెంట్ చేస్తున్న సంఘాలు
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలు ఠంచన్‌గా వసూలవుతున్నాయి. రికవరీ రేటు 98 శాతం వరకు ఉండడంతో బ్యాంకర్లు పెద్దగా తిరకాసు పెట్టకుండానే రుణాలు ఇస్తున్నారు. ఏదైనా కారణంతో సంఘంలోని ఒక మహిళ తన రుణాన్ని తిరిగి చెల్లించకుంటే సంఘంలోని మిగతా సభ్యులే చెల్లిస్తున్నారు. దీంతో రుణాల రీపేమెంట్ ఇబ్బందులు లేకుండా పోయాయి. గ్రూపులోని ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నారు. గతంలో రూ.50 నుంచి రూ.70వేల వరకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అంతకు రెట్టింపు పెంచారు. దీంతో మహిళలు కూడా ఉత్సాహంగా రుణాలు తీసుకుని, తిరిగి చెల్లిస్తున్నారు.
నాలుగు మున్సిపాలిటీల్లో రూ.28.99 కోట్లు
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో 2021-22 సంవత్సరానికి మెప్మా ఆధ్వర్యంలో రూ.28.99 కోట్ల రుణాలు అందజేశారు. మెదక్ మున్సిపాలిటీలో అత్యధికంగా 167 గ్రూపులకు రూ.11.77 కోట్లు అందజేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 91 గ్రూపులకు గాను రూ.6.57 కోట్లు, నర్సాపూర్ మున్సిపాలిటీలో 80 గ్రూపులకు రూ.5.83 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీలో 78 గ్రూపులకు రూ.4.80 కోట్లు అందజేశారు.
లక్ష్యానికి మించి రుణాలు
ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు లక్ష్యానికి మించి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చాం. ఇప్పటికే 107.63 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపాం. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్నారు. లక్ష్యం రూ.386.88 కోట్లు కాగా, రూ.416.40 కోట్లు లక్ష్యానికి మించి రుణాలు అందజేశాం. మెదక్ జిల్లాలో 10,761 గ్రూపుల్లో 8234లకు లింకేజీ రుణాలు పంపిణీచేశాం.
– శ్రీనివాస్, డీఆర్డీవో మెదక్