సంగారెడ్డి, మార్చి 14: ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో బస్తీ పర్యటన చేపట్టి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 8 గంటలకు పాత బస్టాండ్ మోతిమహల్ రోడ్డులోని 4వ వార్డు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నుంచి పర్యటనను కమిషనర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయా వార్డుల కౌన్సిలర్లు ముంతాజ్ అమీర్‌బేగ్, షేక్ సాబేర్, అంజూమ్ అజ్జూభాయ్, నాజిమా తబస్సుం యాకుబ్ అలీతో కలిసి 5వ వార్డు, 25, 26, 38 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి పలరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు 25వ వార్డు కౌన్సిలర్ భర్త అజ్జూ చింతా ప్రభాకర్‌ను శాలువా కప్పి సన్మానించారు.
మున్సిపల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం బస్తీ పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవడం సంతోషకరమని ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల నారాయణఖేడ్‌లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. 5వ వార్డులోని శివాలయం మహబూబ్‌సాగర్ చెరువు నీటిలో ఉందని, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇరిగేషన్ అధికారులు అంచనాలు తయారు చేయాలని సూచించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సమస్యలున్న ప్రాంతాల్లో ఖర్చుచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. 40-50 ఏండ్ల క్రితం నిర్మించిన మురుగు కాల్వలు నేడు శిథిలావస్థలో ఉన్నాయని వాటిని పునఃనిర్మాణం చేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేసి ప్రభుత్వం అనుమతులు రాగానే పనులకు శ్రీకారం చుడతామన్నారు. అంతేకాకుండా పునఃనిర్మాణంలో భాగంగా మురుగు కాల్వల విస్తరణ చేపట్టి వర్షం నీటితో పాటు నిరంతరం వచ్చే మురుగు నీటికి అడ్డంకులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రజల కోరిక మేరకు స్థలాలు అందుబాటులో ఉన్న వార్డుల్లో కాలనీ వాసులు సేదతీరేందుకు పార్కులు, 4,5 వార్డులకు అనుసంధానమయ్యే పార్కులపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్మాణాలు చేపడతామన్నారు. బొబ్బిలి కుంట కట్టను సుందరీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పరిష్కారానికే బస్తీ పర్యటన చేస్తున్నామని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. పర్యటనలో మున్సిపల్ వైస్‌చైర్మన్ లత, కౌన్సిలర్లు రామప్ప, పవన్ నాయక్, సమీ, విష్ణువర్ణన్, అశ్విన్ కుమార్, సోహైల్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మోహన్‌సింగ్ నాయక్, అధికారులు ఇంతియాజ్ అహ్మద్, ఇంజినీరింగ్ అధికారులు, నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింలు, బొంగుల రవి, హరికిషన్, రశీద్, డాక్టర్ శ్రీహరి, ప్రభుగౌడ్, బత్తుల శ్రీనివాస్, లాడే మల్లేశం, నవీన్, ఎన్ఆర్ఐ షకీల్, అంజాద్, యూనుస్, అజీం, శ్రావణ్‌రెడ్డి, జలేందర్, ప్రభుగౌడ్, మురళీధర్, వాజిద్, ప్రవీణ్ కుమార్, పరశురామ్ నాయక్, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.