మెదక్ జిల్లా కొత్త కలెక్టరేట్ భవనం సకల హంగులతో సిద్ధమవుతున్నది. 32ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న సమీకృత భవనంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో స్థాయి కార్యాలయాలతో పాటు అన్ని శాఖలు ఒకే చోట కొలువుదీరనున్నాయి. ఇప్పటికే 75శాతం పనులు పూర్తవగా డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం ఫాల్ సీలింగ్, కలర్ ఫైనల్ కోటింగ్, ఫ్లోరింగ్ పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు పాలన మరింత చేరువవడంతో పాటు పథకాల అమలులో పారదర్శకత పెరగనున్నది.
మెదక్, అక్టోబర్ 28 : కొత్తగా అనేక జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం పాలన ప్రజలకు చేరువ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అన్ని కొత్త జిల్లాల్లోనూ కొత్త కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ఇందులో భాగంగా మెదక్‌లోనూ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు చేపడుతున్నది. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులు, ఆధునిక హంగులతో జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం ఔరంగాబాద్ శివారులోని సర్వే నంబర్ 78లో 32ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తున్నది. 2018 మే 9న సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 75శాతం పను లు పూర్తయ్యాయని, డిసెంబర్ నెలాఖరు వరకు వందశాతం పూర్తిచేస్తామని అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు.
అన్ని శాఖలు ఒకేచోటే..
32 ఎకరాల్లో నిర్మిస్తున్న మెదక్ సమీకృత కలెక్టరేట్ భవనంలో అన్నిశాఖలు ఒకేచోట ఏర్పాటు చేసి పాలన సాగిస్తారు. తద్వారా అన్నిశాఖల అధికారులు ఒక్క దగ్గరనే ఉండడంతో ప్రజల పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగవంతం అవుతాయి. ప్రజలకు అన్నివిధాలుగా సౌకర్యంగా ఉంటుంది. 1.20 లక్షల స్క్వేర్ ఫీట్లతో కలెక్టరేట్ సముదా యం నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వోతోపాటు కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాల కోసం గదులను కేటాయించారు. సమావేశ మందిరాలు, వీడియా కాన్ఫరెన్స్ గది, లిఫ్ట్ లు, మీటింగ్ హాల్, మంత్రి హాల్ వంటి గదులు నిర్మించారు. హెలిప్యాడ్, గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. ముందు భాగంలో పూల మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేసి వాహనాలను నిలిపేందుకు వీలుగా విశాలమైన పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు. ఈ భవన సముదాయం ప్రారంభమైతే మెదక్ జిల్లా ప్రజలకు ఒకేచోట నుంచి అన్ని శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి.
తుది మెరుగులు..
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనానికి పాల్ సీలింగ్, కలర్ ఫైనల్ కోటింగ్, ఫ్లోరింగ్ పనులతో పాటు పెయింటింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ, పక్కనే నిర్మాణం చేస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవో క్యాంపు కార్యాలయాల పనులు చేపడుతున్నారు. త్వరలోనే నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రూ.13 కోట్లతో అదనపు పనులకు ప్రతిపాదనలు..
మెదక్ నూతన కలెక్టరేట్ భవన అదనపు పనుల కోసం రూ.13 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ఆర్అండ్బీ డీఈ వెంకటేశం తెలిపారు. మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు సీసీ రోడ్డు, అప్రోచ్ రోడ్డు, ఇంటర్నల్ సీసీ రోడ్లు, ప్రహరీ తదితర పనులు చేపట్టనున్నారు.
డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేస్తాం
మెదక్ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేస్తాం. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. సమీకృత భవనంలో మేజర్ పనులు పూర్తయ్యాయి. పెయింటింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. త్వరలో మెదక్ నూతన కలెక్టరేట్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం.
-ఎస్.హరీశ్, మెదక్ జిల్లా కలెక్టర్