
జగదేవ్‌పూర్ నవంబర్25 : కొండపోచమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా చల్లగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు మంత్రి హరీశ్‌రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టిదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డితో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం చాట్లపల్లి గ్రామానికి చెందిన భక్తుడు అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు పటం వద్దకు చేరుకుని మంత్రి దీపం వెలిగించగా జోగిని శ్యామల మంత్రికి బొట్టుపెట్టి కంకణం కట్టింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ తల్లి దీవెనలతో పచ్చని పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు..
ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి భక్తుడు అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో సదరు పటం వేసి బోనాలు చేశారు. జోగిని శ్యామల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనమెత్తగా వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లకు అనుగుణంగా పోతరాజులు నృత్యాలు చేస్తూ వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి కిలోన్నర వెండితో తయారు చేసిన త్రిశూలాన్ని అశోక్‌యాదవ్ అమ్మవారికి బహూకరించాడు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రజితరమేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, రైతుబంధు కమిటీ మండల కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నరేశ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు శేఖర్, సత్యం, కుమార్, నాయకులు భూమయ్య, దయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.