
కంది, నవంబర్ 16 : మామూలుగా ఇడ్లీలు తయారు చేయాలంటే ఒకరోజు ముందుగానే పిండిని నానబెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు పిండి పదార్థాన్ని ఇడ్లీ స్టాండ్‌లో పోసి స్టౌవ్‌పై అరగంట పాటు ఉంచితే పాత్ర సైజ్‌ను బట్టి 16-24 ఇడ్లీలు తయారవుతాయి. కానీ, కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే 2వేల ఇడ్లీలు అదే టేస్ట్, నాణ్యతతో తయారవుతాయంటే మీరు నమ్ముతారా. అవును ఇది అక్షరాల నిజం. ఈ సరికొత్త ఇడ్లీ తయారీ యంత్రాన్ని మన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్రలో ప్రారంభించారు. మంగళవారం ప్రముఖ ఔషధ కంపెనీ గ్లాండ్ ఫార్మా పూర్తి సహకారంతో ఈ ఇడ్లీ తయారీ నూతన యంత్రాన్ని ఆ సంస్థ ఎం.డీ.శ్రీనివాస్ సాధు, అక్షయపాత్ర సీఈవో శ్రీధర్వెంకట్ కలిసి ప్రారంభించారు.
20 నిమిషాల్లోనే ఇడ్లీలు సిద్ధం..
నూతనంగా ప్రారంభించిన ఈ ఇడ్లీ మిషన్‌తో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే సిద్ధమవుతాయి. ఈ మిషన్‌లో పల్వెరైజర్ మిక్సింగ్, ఇడ్లీ పిండి ఆటోమెటిక్ అన్లోడింగ్, ఉష్ణోగ్రత నియంత్రిక కుకింగ్ చాంబర్‌తో పాటు పూర్తిగా మానవ స్పర్శ లేకుండా తయారీ చేయడం దీని ప్రత్యేకతని వారు వివరించారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంను 2019లో హైదరాబాద్‌లో ప్రారంభించామని, 2020లో విశాఖపట్నంలో కూడా ప్రారంభించినట్లు సీఈవో శ్రీనివాస్ సాధు తెలిపారు. ఇప్పటికీ ఈ ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌కు చెందిన 13,650 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా సంస్థ సభ్యులు కె.రాఘురామ్, పి.సంపత్‌కుమార్, శిల్పాసహాయ్, ఎస్.స్వాతి, అక్షయపాత్ర సభ్యులు యజ్ఞేశ్వర ప్రభు, రజనీ సిన్హా పాల్గొన్నారు.