
రామాయంపేట, నవంబర్ 9: పంటల మార్పిడీ పాటిస్తూ, అంతర పంటలు సాగుచేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్కి చెందిన రైతు పెద్దోల్ల రాములు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో ప్రస్తుతం ఉల్లిపంట వేశాడు. 90 రోజుల్లో చేతికి వచ్చే ఉల్లిపంటతో పాటు పాడిగేదెల మేత కోసం గడ్డి విత్తనాలను గుంట భూమిలో విత్తుకున్నాడు. గతంలో సైతం ఈ రైతు ఆరుతడి పంటలైన కూరగాయలు సాగుచేసి మంచి ఆదాయం పొందాడు. తరుచూ పంటమార్పిడీ పాటిస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు. ఉల్లి పంటకు మార్కెట్లో భలే గిరాకీ ఉందని, అందుకే ఉల్లి పంటను వేసినట్లు రైతు తెలిపాడు. పంటను కాపాడుకోవడానికి ఉల్లి చేనులో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రిపూట చేనుకు వచ్చి డబ్బాలతో చప్పుడు చేస్తే అడవి జంతువులు పంట చేనులోకి రావనే ఉద్దేశంతో చుట్టూరా జాలీలు ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు రాత్రి పంట వద్దకు వచ్చి చప్పుడు చేసి తెల్లవారుజామున ఇంటికి వెళ్తాడు.
ఏటా పంటలు మారుస్తా..
20 గుంటల భూమిలో ఉల్లిపంట వేశా. అందులో 2 టన్నుల వరకు దిగుబడి తీస్తా. ఉల్లి పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మంచి ధర వస్తున్నది. అందుకే ఉల్లి సాగుచేస్తున్నా. ప్రతి యాసంగిలో కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలు సాగుచేస్తున్నా. అంతర పంటలు సాగుచేసి ఎప్పుడూ నష్టపోలేదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేస్తా.