
పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ భూములను సంరక్షిస్తూనే, పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేక బృందాలతో సాగు హక్కుదారులను గుర్తించి పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేయనున్నది. ఇందుకోసం నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నది. కాగా, మెదక్ జిల్లా పరిధిలో 6867 ఎకరాల పోడు భూములు ఉండగా, 3265 మంది రైతులు సాగుచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2958 ఎకరాల పోడు భూములను 1501 మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ హక్కుపత్రాలను అందజేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
మెదక్/ సంగారెడ్డి, నవంబర్ 7 : పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీంతో ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం లభించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కనీసం 75 ఏండ్లుగా ఆ భూమినే నమ్ముకొని జీవించే వారికి అనుభవించే హక్కు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యటించి సాగు రైతుల వివరాలు సేకరించి వారికి వీలైనంత త్వరలో హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి గిరిజనులు, గిరిజనేతరుల వద్ద దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఐటీడీఏ, అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. అటవీ హద్దులు నిర్దేశించి సాగులో ఉన్న వారిని గుర్తించనున్నారు. అయితే పాత రికార్డులను సైతం పరిగణలోకి తీసుకొని భూములపై ఉన్న హక్కులను నిర్ణయిస్తారు. అటవీహక్కు చట్టంలోని నిబంధనలు అమలు చేస్తూ సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వనున్నారు. కాగా, ప్రభుత్వం పోడు భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించి, ఆ దిశగా అడుగులు వేస్తుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మెదక్ జిల్లాలో 6867 ఎకరాల్లో పోడు భూమి..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 82 గ్రామ పంచాయతీల్లో గిరిజనులు పోడు భూములను సాగు చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, అందులో 17 మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములను సాగుచేస్తూ జీవిస్తున్నారు. మెదక్ జిల్లాలో 6867 ఎకరాల్లో పోడు భూములు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే 3265 రైతులు ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. గ్రామ, మండల ఫారెస్టు కమిటీలను ఏర్పాటు చేసి మరోసారి లబ్ధిదారుల వివరాలను సేకరించనున్నారు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూమిని నమ్ముకొని జీవించే రైతులకు ఆ భూమిపై హక్కు కల్పించే అవకాశమున్నది.
సంగారెడ్డి జిల్లాలో 2958 ఎకరాల పోడుభూములు..
రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో పోడుభూములను సాగు చేస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నది. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధుల్లోని 37 గ్రామ పంచాయతీల్లో 2958 ఎకరాల పోడుభూములను 1501 మంది గిరిజనులు, ఇతరులు సాగుచేసుకుంటున్నారు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రైతులున్నారు.
రైతులకు హక్కు కల్పిస్తే ప్రయోజనాలు..
అటవీ హక్కు చట్టాన్ని వర్తింపజేసి రైతులకు హక్కు కల్పిస్తే పట్టా భూముల మాదిరిగా ఉచిత విద్యుత్, రాయితీ విత్తనాలు, బ్యాంకు రుణాలు ఇస్తారు. వారసత్వంగా ఆ కుటుంబానికి చెందిన వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకొని జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి భూమిపై రైతుకు ప్రభుత్వం హక్కు కల్పిస్తే వారిని అక్కడి నుంచి తరలించేందుకు గానీ, కేసులు నమోదు చేయడం, భయబ్రాంతులకు గురి చేయడానికి ఆస్కారం ఉండదు. డిసెంబర్ 8 తర్వాత అటవీశాఖ రికార్డులను, రెవెన్యూ రికార్డులను అనుసరించి అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారులు, మండల స్థాయి, డివిజన్ స్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇందులో అర్హులు, అనర్హులతో వేర్వేరు జాబితా తయారు చేసి జిల్లా కలెక్టర్కు సమర్పిస్తారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీవో, డీఎఫ్వో, సంబంధిత అధికారుల బృందంతో సమీక్షించి అర్హులను గుర్తించి తుది జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తారు.
గ్రామ కమిటీల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తాం..
ఈ నెల 8వ తేదీ నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామ కమిటీల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తాం. అటవీ హక్కు కమిటీలో 10 నుంచి 15 మంది సభ్యులుంటారు. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల పరిధిలోని 82 గ్రామ పంచాయతీల్లో 82 అటవీహక్కు గ్రామ కమిటీలను ఎన్నుకుంటాం. జిల్లాలో 6867 ఎకరాల్లో పోడు భూములు ఉండగా, 3265 మంది రైతులు సాగు చేస్తున్నారు.