ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క కోసం నాలుక లాగేస్తది. ఆ రోజు భోజనంలో కచ్చితంగా మటనో, చికెనో, చేపలో ఉండాల్సిందే. మన రాష్ట్రంలో అయితే ఆదివారంతో పట్టింపులేకుండా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో మాంసం ఘుమఘుమలు ముక్కుకు సోకాల్సిందే. మరి మనం తింటున్న మాంసం పరిశుభ్రమైందేనా? ఈ అనుమానం చాలామందికి రాదు. కానీ చాలాచోట్ల మాంసం కోయటం నుంచి విక్రయించటం వరకు అపరిశుభ్ర వాతావరణంలోనే సాగుతుంటాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టింది జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం (ఎన్ఆర్సీఎం). మాంసం విక్రయదారులకోసం మినీ కబేలాలను డిజైన్చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన, పరిశుభ్రమైన మాంసాన్ని వినియోగదారులకు అందించేందుకు జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం (ఎన్ఆర్సీఎం) మినీ స్లాటర్ హౌజ్ (కబేలా)ను ఆవిష్కరించింది. పోర్టబుల్ మీట్ ప్రొడక్షన్ అండ్ రిటైలింగ్ ఫెసిలిటీ (పీ మార్ట్)గా పేరుపెట్టిన ఈ కబేలాను 120 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న చిన్న గదిలో కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. ఇది వ్యాపారులతోపాటు వినియోగదారులకు కూడా అనువుగా ఉంటుందని ఎన్ఆర్సీఎం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక్కో పీ మార్ట్ యూనిట్‌ను రూ.10 లక్షలకు విక్రయిస్తామని చెప్పారు. పీ మార్ట్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు వెల్లడించారు.
పది మేకలు కోసి విక్రయించే వసతి
రోజుకు పది మేకలు/గొర్రెలను కోసి మాంసం విక్రయించుకొనేలా పీ మార్ట్‌ను డిజైన్ చేశారు. మేకలను కోసిన తర్వాత మాంసాన్ని కడగడానికి, వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇందులో ఎక్కువ నీరు అవసరం ఉండదు. మాంసం కడిగిన నీటిని కూడా డ్రైనేజీల్లో పారబోయకుండా నిల్వచేసి తర్వాత బయోగ్యాస్ కోసం వాడుకొనేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ కబేలాలో నాలుగు భాగాలుంటాయి. ఒక్కో పోర్షన్ నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు, ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది. తేలికగా తరలించేందుకు ప్రతి పోర్షన్‌కు చక్రాలు ఉంటాయి. సాధారణ డీసీఎం లారీలో మొత్తం కబేలాను తరలించవచ్చు. వీటిని కోనుగోలు చేసేవారికి మూడు రోజులపాటు చెంగిచెర్లలోని ఎన్ఆర్సీఎంలో శిక్షణ ఇస్తారు.
అందరికీ అనువుగా ఉండేలా..
ప్రస్తుతం ఉన్న కబేలాల నిర్మాణానికి కోట్ల రూపాయల ఖర్చవుతుంది. మటన్ కోసిన రెండు గంటల్లో విక్రయిస్తేనే నాణ్యమైనదిగా భావిస్తాం. నగరాలకు దూరంగా ఉండే కబేలాలతో ఇది సాధ్యంకాదు. ఈ సమస్యలకు పరిష్కారంగానే పీ మార్టుకు రూపకల్పన చేశాం. వీటిల్లో ఎప్పుడంటే అప్పుడు మటన్ కోసి వెంటనే విక్రయించవచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వ్యక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. అందరికి అనువుగా ఉంటుంది.
మినీ కబేలాలో ఉండే పరికరాలు