హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లా విషాదం చోటు చేసుకుంది. కోతులపై(Monkeys) విషయ ప్రయోగం చేయడంతో పది కోతులు మృతి చెందాయి. మరికొన్ని కోతులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండా పశువైద్య సిబ్బంది కాపాడారు. ఈ విషాదాకర సంఘటన బిక్కనూరు మండలం అంతంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తుతెలియని వ్యక్తులు కోతులను అంతంపల్లి సమీపంలోని ఓ హోటల్ వద్ద వదిలిపోయారు. కోతులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ ఏనుగు మంజుల వెంటనే పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఎవరో వాహనంలో సుమారు 150 నుంచి 200 వరకు కోతులను తీసుకొచ్చి వదిలిపెట్టనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో దుండగులు మూగజీవాలకు విషం పెట్టి చంపి వేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇది గ్రామస్తులకు, పశువులకు కూడా ప్రమాదకరమని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వాలు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.